రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో రూ.1.50 కోట్లతో జీవ వైవిధ్య పార్కులు, వాటికి అనుబంధంగా రూ.50 లక్షలతో మ్యూజియంలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కాకినాడ, కడప, తిరుపతి, నెల్లూరు, విశాఖ, అమరావతి, కర్నూలుతో పాటు అన్ని జిల్లాల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి భూమి గుర్తింపు, ఇతర అంశాలు పురోగతిలో ఉన్నాయన్నారు. విజయవాడలో జల సంబంధిత జీవ వైవిధ్యం, జాతుల పరిరక్షణకు ప్రణాళికపై ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌నకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
‘మానవాళి మనుగడకు జీవ వైవిధ్య పరిరక్షణ అత్యంత ఆవశ్యకం. దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. రాష్ట్రంలో జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 14,157 జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలు ఏర్పాటు చేశాం. మొదటి విడత కింద వీటికి రూ.9 కోట్లు విడుదల చేశాం’ అని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ఛైర్మన్ బీఎమ్‌కే రెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నళినీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.