వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా పాడి పశువులు, గొర్రెల కొనుగోలుకు రూ.5,386 కోట్లను కేటాయించామని పశుసంవర్థకశాఖ మంత్రి ఎస్.అప్పలరాజు తెలిపారు. పథకంలో భాగంగా లబ్ధిదారులకు అందించేందుకు ఇతర రాష్ట్రాలతో పాటు స్థానికంగానూ మేలు జాతి పశువులను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. మొదటి దశలో భాగంగా లక్ష పశువులను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి వరకు కొనుగోలు, బ్యాంక్ లింకేజీ చేపడతామన్నారు. రెండున్నర లక్షల మంది గొర్రెలు, మేకల కోసం దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఒక్కో యూనిట్ 75 వేలు, అదనంగా కాపరులకు కిట్ ఇస్తామని స్పష్టం చేశారు. అమూల్ సంస్థతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. అమూల్ పాల మార్కెటింగ్ కు సహకారం అందిస్తుందన్నారు. నవంబర్ 26న ఏపీ అమూల్ ప్రాజెక్టు ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇవాళ్టి నుంచే ఈ ప్రాజెక్టు కోసం ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో పాల సేకరణ మొదలైందన్నారు. రాష్ట్రంలో అదనంగా 200 లక్షల లీటర్ల పాల ఉత్పత్తిని అమూల్ మార్కెటింగ్ చేస్తుందనేది అంచనా వేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 9688 రైతు భరోసా కేంద్రాల నుంచి మహిళల ద్వారా పాల సేకరణ చేస్తామని అన్నారు.