ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Minister Anilkumar: కేంద్రమంత్రి అవగాహనరాహిత్యంతోనే మాట్లాడారు..!

అన్నమయ్య ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్​ చేసిన వ్యాఖ్యలు అవగాహనరాహిత్యంతో కూడినవని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.

minister-anilkumar-yadav-comments-on-central-minister-gajendra-singh-shekavat
కేంద్రమంత్రి అవగాహన రాహిత్యంతోనే మాట్లాడారు..!

By

Published : Dec 4, 2021, 9:42 AM IST

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వ్యాఖ్యలు అవగాహనారాహిత్యంతో కూడినవని.. జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రాజెక్టు గేట్ల సామర్థ్యానికి మించి హఠాత్తుగా వచ్చిన వరదతోనే అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇటువంటి ఘటనే ఉత్తరాఖండ్‌లో జరిగిందన్నారు. ఆ విపత్తులో 150 మంది జలసమాధి అయ్యారని.. అక్కడ భాజపా అధికారంలో ఉన్నందున నిజాల్ని దాచే ప్రయత్నం చేశారని విమర్శించారు.

అన్నమయ్య ప్రాజెక్టు ఐదో గేటు తెరుచుకున్నా, అందులో నుంచి 40 వేల క్యూసెక్కులు నీళ్లు మాత్రమే బయటికి వెళ్లే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాలతో 3 లక్షల క్యూసెక్కులకు పైగానే వరద వచ్చిందని.. అందువల్ల ఒక గేటు తెరుచుకోలేదన్న వాదనకు విలువ లేదని అనిల్ వ్యాఖ్యానించారు. జిల్లా కలెక్టర్‌తోపాటు ప్రాజెక్టు అధికారులు లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి సమాచారం తెలుసుకోకుండా.. పార్లమెంటులో కేంద్రమంత్రి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని అనిల్ యాదవ్ ప్రశ్నించారు.

కేంద్రమంత్రి ఏమన్నారంటే..

central minister on annamayya dam: ఇటీవల వరదలు వచ్చినప్పుడు అన్నమయ్య డ్యాంకు ఒకేసారి స్పిల్‌వే సామర్థ్యానికి మించిన వరద రావడంతో అది విరిగిపోయి విపత్తు సంభవించిందని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పేర్కొన్నారు. గురువారం రాజ్యసభలో డ్యాంసేఫ్టీ బిల్లు చర్చకు సమాధానమిస్తూ చేసిన ప్రసంగంలో ఆయన ఈ విషయం తెలిపారు. ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందే సమయానికి దేశంలో 41 డ్యాంలు తెగిపోయాయని, రాజ్యసభలో ఆమోదించేసరికి ఆ సంఖ్య 42కి చేరిందని గుర్తు చేశారు.

గేటు తెరుచుకోవపోవడానికి బాధ్యులెవరు?

gajendra singh shekhawat on annamayya dam: ‘అన్నమయ్య డ్యాంకు ఒకేసారి దాని స్పిల్‌వే సామర్థ్యానికి ఒకటిన్నర రెట్లు అధికంగా నీళ్లు వచ్చాయి. అందుకే స్పిల్‌వే విరిగిపోయింది. స్పిల్‌వే, గేట్లు తెరిచి నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నించారు. కానీ ఒక గేటు తెరుచుకోలేదు. దానికి బాధ్యులు ఎవరు? రాష్ట్రానికి దాని బాధ్యత లేదా? ఈ డ్యాం గురించి అంతర్జాతీయంగా అధ్యయనం మొదలుపెడితే అది మనకు సిగ్గుచేటు. డ్యాం తెగిపోవడానికి సభలో కూర్చున్న సభ్యులంతా బాధ్యత వహించాల్సిందే. డ్యాం సేఫ్టీ బిల్లు ద్వారా ఏర్పాటు చేస్తున్న జాతీయ డ్యాం సురక్ష ప్రాధికార సంస్థకు జరిమానాలు వేసే అధికారం ఉంటుంది. డ్యాం రిహాబిలిటేషన్‌ అండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం (డ్రిప్‌)లో ఆంధ్రప్రదేశ్‌ డ్యాంలను డ్రిప్‌లో చేర్చలేదని విజయసాయిరెడ్డి అన్నారు. అయితే కొలమానాలను ఆంధ్రప్రదేశ్‌ చేరుకోలేదు. చేరుకుంటే మీరు సూచించిన డ్యాంలనూ ఇందులో చేరుస్తామని సభాముఖంగా చెబుతున్నా’ అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:NTR VERSITY ISSUE: నిధులివ్వకపోతే ఇంటికి రావొద్దన్నారు.. నేనేం చేయాలి?

ABOUT THE AUTHOR

...view details