పంచాయతీ ఎన్నికల్లో 81 శాతం స్థానాలను వైకాపా గెలిచిందని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పాలన వల్లే పంచాయతీ ఎన్నికల్లో ఈ విజయం సాధ్యమైందన్నారు. నాలుగు దఫాల్లో కలిపి కేవలం 16 శాతం పంచాయతీలను మాత్రమే తెదేపా గెలుచుకుందన్నారు.
చంద్రబాబును సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ప్రజలు చీకొట్టారని మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. కుప్పంలో 8 వార్డులు గెలిచినందుకు సంబరాలు జరుపుకున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. పోలీసులు బాగా పని చేశారని ఎస్ఈసీ ప్రశంసిస్తుంటే.. చంద్రబాబు మాత్రం పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ఫలితాలతో చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారన్నారు.