Minister Ambati on PPA letter: దిగువ కాఫర్‌డ్యాం పనులు జులై నెలాఖరులోగా పూర్తి చేయకపోవడంతో నష్టం జరిగిందంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) జులై 22న రాసిన లేఖలో పేర్కొన్నది వాస్తవమేనని రాష్ట్ర జలవనరుల మంత్రి అంబటి రాంబాబు అంగీకరించారు. వరదల కారణంగానే పనులు పూర్తి చేయలేకపోయామంటూ వారికి సమాధానమివ్వబోతున్నామన్నారు. పోలవరం పనులకు సంబంధించి ఇటీవల రూ.453 కోట్లు అదనంగా ఇచ్చిన విషయమై విజయవాడలో విలేకరులు ప్రశ్నించగా.. తర్వాత చెబుతామని సమాధానమిచ్చారు.
‘జులై 31నాటికి దిగువ కాఫర్‌డ్యాం పనులు పూర్తి చేయాలని పీపీఏ చెప్పింది. డిజైన్లు ఏప్రిల్‌లో ఇచ్చారు. ఇందులో వారి తప్పేమీ లేదు. అక్కడ భయంకరమైన గుంతలు ఏర్పడటంతో జియోబ్యాగ్స్‌తో జెట్ గ్రౌటింగ్ చేయమని చెప్పారు. అయితే ఎవరూ ఊహించనట్టుగా జులై 8న వరదలు మొదలుకావడంతో 9, 10వ తేదీలనుంచి పనులకు ఆటంకమేర్పడింది. వరదలు రావడం, మునిగిపోవడం నిజం కాదా?’ అని అంబటి ప్రశ్నించారు. ‘డయాఫ్రంవాల్ ఆరోగ్యం ఏమిటో తెలుసుకోలేకపోతున్నాం. పెద్ద పెద్ద గుంతలు పూడ్చలేక, సాంకేతికత అర్థం కాక చస్తున్నాం’ అని వివరించారు. ‘ఎగువ, దిగువ కాఫర్‌డ్యాంలు నిర్మించకుండా డయాఫ్రంవాల్ కట్టడమే దీనంతటికీ కారణం. కారకులైన వారిపై చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.