రాష్ట్రంలోని 44 వేల ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపర్చేందుకు మన బడి నాడు-నేడు అమలు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. విజయవాడలోని సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలో పాఠశాలల్లో నాడు-నేడు ద్వారా ఏర్పాటు చేయనున్న మౌలిక సదుపాయాలు, ఇతర ఉపకరణాలను ఆయన పరిశీలించారు. పాఠశాలల్లో 9 అంశాలను మార్పు చేసేందుకు ఉద్దేశించిన నాడు-నేడును త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. ఉపకరణాల కొనుగోళ్లను ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్ ద్వారా పూర్తి చేశామని మంత్రి తెలిపారు. రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ ప్రివ్యూ ద్వారా సమీక్ష కూడా పూర్తి అయిందని వెల్లడించారు. ఈ ప్రక్రియ ద్వారా రూ.143 కోట్లు ఆదా అయ్యాయని ఆయన అన్నారు.
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పాటిస్తున్నాం. జులై నెలాఖరుకు మొదటి విడతగా 15 వేల పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి అవుతాయి. ఇందుకోసం రూ.710 కోట్లు రివాల్వింగ్ ఫండ్ ఉంచాం. ఇప్పటి వరకు రూ.504 కోట్లు ఖర్చు చేశాం.
-- ఆదిమూలపు సురేశ్, విద్యాశాఖ మంత్రి