ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'‘గాలి’ అడిగితే కాదంటామా'.. ఏపీ పరిధిలో మళ్లీ తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం - ఏపీ తాజా వార్తలు

Gali Janardhan Reddy: ఓబులాపురం మైనింగ్ కంపెనీ.....ఒకప్పుడు తెలుగునాట మారుమోగిన పేరు. వివాదాస్పద మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్‌రెడ్డి అక్రమ వ్యాపారానికి అడ్డా ఓఎంసీ.. సీబీఐ కేసుల అనంతరం మూతపడిన ఈ గనులు మళ్లీ తెరుచుకోనున్నాయి. అన్నయ్య గాలి జనార్దనరెడ్డి అడగటమే ఆలస్యం.. తమ్ముడు తనవంతుగా సహకారం అందించేందుకు మరోసారి సిద్ధమయ్యాడు.

Gali Janardhan Reddy
గాలి జనార్దనరెడ్డి తవ్వకాలు

By

Published : Aug 10, 2022, 8:32 AM IST

Gali Janardhan Reddy: వివాదాస్పద మైనింగ్‌ వ్యాపారి, కర్ణాటక మాజీమంత్రి గాలి జనార్దనరెడ్డి ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని గనుల్లో మళ్లీ తవ్వకాలు ప్రారంభించేందుకు మార్గం సుగమం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. తవ్వకాలు ప్రారంభించేందుకు అనుమతివ్వాలంటూ ఆయనకు చెందిన ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందించింది. కర్ణాటకతో సరిహద్దు అంశంపై స్పష్టత వచ్చినందున, తమ భూభాగంలో తవ్వకాలకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఆ నేపథ్యంలో ఓఎంసీ విజ్ఞప్తిని పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఆ కంపెనీపై దాఖలైన మరో కేసును విచారిస్తున్న ధర్మాసనానికి ఈ కేసునూ నివేదించాలని సూచించింది. దానిపై బుధవారం విచారణ జరగనుంది.

గాలి జనార్దనరెడ్డి తవ్వకాలు

గాలికి చెందిన ఓఎంసీ పలు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది. వాటిపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. 2009లో ఆ కంపెనీని తవ్వకాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై ఓఎంసీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించగా, తీర్పు ఆ కంపెనీకి అనుకూలంగా వచ్చింది. దానిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఒకపక్క ఓఎంసీపై కేసు విచారణ పెండింగ్‌లో ఉండగానే.. తన భూభాగం పరిధిలో తవ్వకాలకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం గమనార్హం.

కర్ణాటక సంతకం చేయకుండానే:గనుల్లో మళ్లీ తవ్వకాలకు అనుమతించాలని ఓఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు జులై 21న విచారణ జరిపింది. ఆ సందర్భంగా ఏపీ, కర్ణాటక మధ్య సరిహద్దులు నిర్ణయించే ప్రక్రియ పూర్తయిందని, దాన్ని సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదించారని కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తెలియజేశారు. మ్యాప్‌పై ఏపీ ప్రభుత్వం తరఫున ఇప్పటికే సంతకం కూడా చేసేశారని, కర్ణాటక ప్రభుత్వం ఇంకా చేయాల్సి ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సరిహద్దు వివాదాన్ని లేవనెత్తడం వల్లే గతంలో తవ్వకాలు నిలిపివేశారని, ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం పరిష్కారమైంది కాబట్టి మళ్లీ అనుమతివ్వాలని ఓఎంసీ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. దానిపై ఏపీ ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. కేటాయించిన పరిధిలో తవ్వకాలు జరిపేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. సరిహద్దుల్ని నిర్ణయిస్తూ రూపొందించిన మ్యాప్‌పై ఇంకా కర్ణాటక ప్రభుత్వం తరఫున సంతకాలు చేయకుండానే, మైనింగ్‌కు తమకు అభ్యంతరం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అక్రమాలు నిజమని సీఈసీ కూడా తేల్చింది:ఓబుళాపురం గనుల్లో మళ్లీ తవ్వకాలు ప్రారంభించేందుకు గాలి జనార్దనరెడ్డి చేస్తున్న ప్రయత్నాలపై ఆంగ్ల దినపత్రిక ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ మంగళవారం ఆన్‌లైన్‌ ఎడిషన్‌లో ఒక కథనం ప్రచురించింది. ఓఎంసీ అక్రమాలపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన కేంద్ర సాధికార సంస్థ (సీఈసీ) అవన్నీ నిజమేనని ధ్రువీకరిస్తూ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిందని పేర్కొంది. ఆ పత్రిక ప్రస్తావించిన ముఖ్యాంశాలు, ఇచ్చిన వివరాలు ఇవి..

* ఓఎంసీకి కేటాయించిన గనులకు సరిహద్దులు చెరిపేశారని, సరిహద్దు రాళ్లు తీసేసి అక్రమంగా పరిధి పెంచేసుకున్నారని, లీజు పరిధిని అతిక్రమించి ఖనిజాన్ని తవ్వేశారని, మైనింగ్‌ లీజును చట్టవిరుద్ధంగా 12-17 ఏళ్లకు పెంచుకున్నారని, రిజర్వు ఫారెస్ట్‌లో ఖనిజాన్ని డంప్‌ చేశారని, అటవీశాఖ అనుమతుల్లేకుండానే తవ్వకాలు జరిపారని, ఖనిజం అక్రమ రవాణాకు అడవుల్లో రహదారులు వేశారని, కర్ణాటక భూభాగంలోని అడవుల్లోనూ రోడ్డు వేశారని ఓఎంసీపై తీవ్రమైన అభియోగాలున్నాయి.

* రోశయ్య ఉమ్మడి రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టాక 2010లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం.. ఓఎంసీ 1.95 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తవ్వేసిందని, అలాంటి కంపెనీకి గనుల తవ్వకాలు కొనసాగించేందుకు అనుమతివ్వడం సరికాదని సుప్రీంకోర్టుకు నివేదించింది. కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమాలు జరిగినట్టు పేర్కొనడంతో.. ఓఎంసీ గనుల తవ్వకాల్ని నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

పరిణామ క్రమం ఇదీ:* ఓఎంసీపై ఫిర్యాదులు రావడంతో 2009 ఏప్రిల్‌లో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ, లీజు ప్రాంతాల సరిహద్దులు నిర్ణయించే వరకు తవ్వకాలు నిలిపివేసింది.

* ఓఎంసీ అతిక్రమణలకు పాల్పడిందన్న ఆరోపణల్ని ఏపీప్రభుత్వం ఖండించింది. దాంతో అటవీశాఖ తన ఉత్తర్వుల అమలు నిలిపివేసింది.

* 2009 మేలో స్థానిక మైనింగ్‌ వ్యాపారి ఒకరు ఓఎంసీ అక్రమాలపై సుప్రీంను ఆశ్రయించారు.

* లీజులను సస్పెండ్‌ చేయాలని, సరిహద్దులు గుర్తించాలని, దీనికి అయ్యే వ్యయాన్ని రికవరీ చేయాలని 2009, నవంబరులో సీఈసీ సిఫార్సు చేసింది. తర్వాత రాష్ట్ర కమిటీ సైతం పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్‌ కార్యకలాపాలను నిలిపివేసింది.

* 2009, డిసెంబరులో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. మరోవైపు ఓఎంసీ హైకోర్టును ఆశ్రయించగా, మైనింగ్‌ కార్యకలాపాలను నిలిపేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్‌ చేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది.

* దీంతో 2010 ఫిబ్రవరిలో మైనింగ్‌ నిలిపేస్తూ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు రద్దుచేసింది.

* 2011-13లో కర్ణాటకలోని బళ్లారి పరిధిలో కూడా మైనింగ్‌ నిలిపేయాలని ఆదేశించింది. కర్ణాటక మైనింగ్‌ లీజులపై కూడా సీఈసీ పలు నివేదికలు అందజేసింది.

* ఏపీ, కర్ణాటకల సరిహద్దులను నిర్ణయించేందుకు 12 వారాల గడువు నిర్ణయిస్తూ సుప్రీంకోర్టు 2017 డిసెంబరులో ఆదేశాలు జారీ చేసింది.

* సరిహద్దుల గుర్తింపు పూర్తి చేయకపోవడంపై 2018లో 2 రాష్ట్రాలను సుప్రీం మందలించింది.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details