ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మా పయనం ఆగదు...! - రాష్ట్రవ్యాప్తంగా వలస కూలీల ఇబ్బందులు

'కాళ్లు బొబ్బలెక్కినా...ఒళ్లు నీరసంతో తూలిపోతున్నా.. ఆకలైనా... దాహమైనా ఆగేది లేదు. ఆరునూరైనా... మా ఊరు పోవాల్సిందే’నని వలస కార్మికులు బయలుదేరుతున్నారు. కొన్నిచోట్ల అధికారులు అడ్డుకుంటుంటే... వాగ్వాదాలకు దిగుతున్నారు. కాళ్లావేళ్లా పడుతున్నారు. ఎలాగైనా సొంతూరికి పోతామని పట్టుబడుతున్నారు.

migrent labour problems in ap state
రాష్ట్రవ్యాప్తంగా వలస కూలీల ఇబ్బందులు

By

Published : May 6, 2020, 7:34 AM IST

తినడానికి తిండి లేదు..ఉపాధి కరువైంది. బతుకు భారమైంది. దయచేసి మమ్మల్ని స్వస్థలాలకు పంపాలంటూ వలస కూలీల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు.

'పోలవరం’ కూలీల పయనం.. అడ్డగింత

పోలవరం ప్రాజెక్టు పనులకోసం బిహార్‌, ఝార్ఖండ్‌, దిల్లీ, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూలీలు వలసవచ్చారు. లాక్‌డౌన్‌తో కొంతకాలంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఇక్కడే ఉండిపోయారు. ఊరువెళ్లాలని సోమవారం అర్ధరాత్రి బయలుదేరిన సుమారు 600 మంది దేవీపట్నం సమీపానికి వచ్చారు. పోలీసులు వారిని వెనక్కి పంపించేశారు. వారు వెనుదిరగలేదు. మంగళవారం తెల్లవారుజాముకంతా పురుషోత్తపట్నం మీదుగా బృందాలుగా 18 కిలోమీటర్ల మేర కాలినడకన సీతానగరం వద్దకు చేరారు. పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం ఏటిగట్టు, బస్టాండుల వద్ద వారిని నిలిపివేశారు. అప్పటికే కొందరు రాజమహేంద్రవరం వెళ్లడంతో అర్బన్‌ జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. అధికారులు అక్కడికొచ్చి కూలీలు ముందుకు వెళ్లకుండా ఆపేశారు. అనంతరం వారిని ఇసుక లారీల్లో ఎక్కాలని చెప్పడంతో.. తమను మళ్లీ పోలవరం ప్రాజెక్టు పనుల వద్దకు పంపించవద్దని, సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతామంటూ పోలీసులను ప్రాధేయపడ్డారు. ఉన్నతాధికారుల సూచనలతో వీరిని రాజమహేంద్రవరం గ్రామీణంలోని కాతేరు వద్దనున్న ఓ కల్యాణ మండపానికి తరలించారు.

కార్మికుల ఆందోళన

గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిలభారత వైద్యవిజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్‌) నిర్మాణ పనులకు వచ్చిన వివిధ రాష్ట్రాల కార్మికులు మంగళవారం ఆందోళనకు దిగారు. తమను స్వస్థలాలకు పంపాలని, వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నిర్మాణసంస్థకు చెందిన కార్యాలయంపై వారు దాడికి ప్రయత్నించగా సమాచారం తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకున్నారు. 3 రోజుల్లో స్వస్థలాలకు పంపుతామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.

* విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం రాజవరం డెక్కన్‌ పరిశ్రమలో పనిచేసే వలస కార్మికులు మంగళవారం తమ ప్రాంతాలకు వెళ్లిపోతామని పయనమయ్యారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. కార్మికుల వివరాలు సేకరించి, అనుమతులు వచ్చిన తరువాత ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారి ప్రాంతాలకు పంపిస్తామని అధికారులు తెలిపారు.

సొంత రాష్ట్రాలకు తరలింపు

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల సమీపంలో నిర్మిస్తున్న రామ్‌కో సిమెంటు కర్మాగారంలో పనులు చేస్తున్న కార్మికులను సొంతరాష్ట్రాలకు పంపటానికి అధికారులు మంగళవారం చర్యలు చేపట్టారు. తమను స్వస్థలాలకు పంపాలని సోమవారం వీరు ఆందోళన చేశారు. కర్మాగారానికి చెందిన యాజమాన్యం చొరవ తీసుకోకపోవటంతో వారు టైర్లకు నిప్పుపెట్టారు. స్థానిక అధికారులు చొరవ తీసుకొని జిల్లా అధికారులతో, యాజమాన్యంతో మాట్లాడి 11 బస్సుల్లో కర్నూలుకు కార్మికులను తరలించేందుకు సిద్ధమయ్యారు. వచ్చిన బస్సుల్లో తొలుత బిహార్‌ కార్మికులనే తరలిస్తామన్నారు.

ముంబయి నుంచి ఏపీకి వలస కూలీలు

మహారాష్ట్రలో ఉంటున్న 900 మంది వలస కూలీలు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు ముంబయి పోలీసులు అనుమతిచ్చారు. వీరు కళ్యాణ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రత్యేక రైలులో గుంతకల్‌ చేరుకుంటారు.

ఇవీ చదవండి...'నీళ్లు తాగి బతుకుతున్నాం.. మమ్మల్ని పంపేయండి'

ABOUT THE AUTHOR

...view details