ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉపాధి కోల్పోయి సొంతూరి బాటలో వలస కార్మికులు - ap corona cases latest

లాక్‌డౌన్‌ కష్టాలతో వలస కూలీలు విలవిల్లాడుతున్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్నవాళ్లు సొంత రాష్ట్రాల్లోని కుటుంబసభ్యుల గురించి ఆలోచిస్తుంటే... కుటుంబాలతో ఉన్నవాళ్లు అన్నపానీయాల కోసం కష్టాలు పడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలసకూలీలు... కాలినడకనే స్వగ్రామాలకు ప్రయాణమవుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించి వాహనాల్లో ప్రయాణిస్తున్నవారిపై పోలీసులు కేసులు పెడుతున్నారు.

migrated-labors-problems
migrated-labors-problems

By

Published : Apr 17, 2020, 2:56 AM IST

రోజురోజుకూ పెరుగుతున్న స్వస్థలాలకు బయలుదేరిన వలసకూలీలు

లాక్‌డౌన్‌ పొడిగింపుతో ఎక్కడికక్కడ చిక్కుకున్న వలస కూలీల కష్టాలు తారస్థాయికి చేరాయి. కుటుంబంపై బెంగతో కొంతమంది.... ఉపాధి, భోజనం లేక మరికొంతమంది కాలినడకనే ఇళ్లకు బయలుదేరుతున్నారు. విజయవాడ, నెల్లూరు, గుంటూరు తదితర ప్రాంతాలతోపాటు... తెలంగాణ, తమిళనాడులో పనిచేస్తున్నవాళ్లంతా సైకిళ్లు, బైక్‌లపై, కొంతమంది కాలినడకనే సొంతూళ్లకు ప్రయాణం ప్రారంభించారు. తమిళనాడు నుంచి 45 మంది ఒడిశా వాసులు సైకిల్‌ యాత్ర చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూలీలు విజయవాడ వరకూ నడుచుకుని వచ్చి అక్కడ సైకిళ్లు కొని ఇంటికి ప్రయాణం ప్రారంభించారు.

నెల్లూరులో చిక్కుకున్న ఒడిశా వలస కార్మికులకు... ప్రభుత్వం సాయం అందించకపోవటంపై బీజేడీ ఎంపీ అమర్‌ పట్నాయక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 మంది వలస కార్మికులకు రేషన్‌ అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశామని, ఇప్పటివరకూ ఎటువంటి సాయమూ అందలేదని ఆయన ట్వీట్‌ చేశారు. 10 రోజులుగా కనీసం రేషన్‌ సరుకులు అందించకపోవటంతో... వేరే దారి లేక వారు కాలినడకనే ఒడిశాకు బయలుదేరారని చెప్పారు.

గుజరాత్‌, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో చిక్కుకున్న శ్రీకాకుళం మత్స్యకారులను స్వస్థలాలకు తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారి కుటుంబసభ్యులు కోరారు. రణస్థలం, ఎచ్చెర్ల మండలాలకు చెందిన మత్స్యకారులు చేపలవేటకు వెళ్లి చిక్కుకున్నారు. వారు ఫోన్‌ చేసి భోజనం దొరక్క అల్లాడిపోతున్నామని చెప్పారని కుటుంబసభ్యులు తెలిపారు.

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు, పాలపాడులకు చెందిన 45 మంది కూలీలు... లాక్‌డౌన్‌కు ముందే తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు. వారంతా వాహనాన్ని మాట్లాడుకుని స్వగ్రామాలకు బయలుదేరారన్న విషయం తెలుసుకున్న గ్రామస్థులకు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రయాణిస్తున్న వారందర్నీ పోలీసులు క్వారంటైన్‌ కేంద్రాలకు పంపించారు.

గుంటూరు శివారులోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న నిరు పేదలు... లాక్‌డౌన్‌ వల్ల ఆకలితో అలమటిస్తున్నారు. సమ్మర్‌పేట, రామాంజనేయపేటకు చెందిన కూలీలు.... రేషన్‌ కార్డు లేక సరుకులు తెచ్చుకోలేకపోయామని వాపోయారు. స్వచ్ఛంద సంస్థలు తెచ్చే భోజనంపైనే ఆధారపడుతున్నామని... నిత్యావసర సరుకులు కొనుక్కోవటానికీ డబ్బులు లేవని వాపోయారు.

విశాఖలో యూపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్‌కు చెందిన వలసకూలీలు... తమ కుటుంబసభ్యుల గురించి ఆందోళన చెందుతున్నారు. సొంత రాష్ట్రాలకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో జీవీఎంసీ వారికి అన్నపానీయాలు, వసతి కల్పించింది. ఇక్కడ సౌకర్యాలు బాగున్నప్పటికీ... సొంత రాష్ట్రంలో ఉన్న తమ కుటుంబసభ్యుల పరిస్థితులపై కూలీలు ఆందోళన చెందుతున్నారు.

స్వస్థలాలకు పంపించాలని, లేదంటే తమ కుటుంబసభ్యులకు నిత్యావసరాలు అందిస్తామనే భరోసా కల్పించాలని వలసకూలీలు కోరుతున్నారు.

ఇవీ చదవండి:రాష్ట్రంలో విద్యాపరమైన అంశాలకు ఆటోమేషన్

ABOUT THE AUTHOR

...view details