హైవేల వెంట.. రైలు పట్టాల వెంట.. రోజుల తరబడి అంతులేని పయనం సాగిపోతూనే ఉంది. ఏ దారిన చూసినా.. ఏ ఊరిన చూసినా ఇవే విచలిత దృశ్యాలు. ఈసురోమంటూ పెద్దలు.. కాళ్లీడుస్తూ పసివాళ్లు.. అనంతంగా సాగిపోతున్న వ్యథార్త జీవుల యథార్థ గాథలు.. అంతదూరం సాగలేక దారిలోనే రాలిపోయేవాళ్లు కొందరైతే.. ఎండకు డస్సిపోతున్నవారు మరికొందరు! మహానగరంకు వలస వచ్చిన వీరి కన్నీటి వెతలకు ఎప్పుడు తెరపడుతుందో. ఎప్పటికి ముగుస్తుందో ఈ మహావిషాద పయనం!!
చెప్పలేనంత దూరం.. చెప్పులైనా లేకుండానే...
అమ్మచెంగు పట్టుకుని కాళ్లకు చెప్పుల్లేకుండా కాలుతున్న రోడ్డుపై నడిచి వెళ్తున్న చిన్నారి పేరు పూజ. తండ్రి కిరణ్, తల్లి రుక్మిణీభాయి. బాలానగర్‌లో ఓ కంపెనీలో పనిచేసేందుకు వీరు రాజస్థాన్ నుంచి వచ్చారు. కొద్దిరోజులుగా రైళ్ల కోసం ఎదురుచూసి ఇక లాభం లేదనుకుని నడక మొదలుపెట్టారు. ‘‘ఇంట్లో ఉన్న పిండితో రొట్టెలు చేసుకున్నాం. కొన్ని బట్టలు, నీళ్లసీసాలతో కాలినడక ప్రారంభించాం. లారీలో వెళ్లాలంటే ఒక్కొక్కరికి రూ. 1500 వరకు అడుగుతున్నారు. మా వద్ద ఉన్నవే రూ. 3500. అందుకే కష్టమైనా నడక ప్రారంభించాం’’ అని కిరణ్ తెలిపారు. పాపకు చెప్పులు లేకపోవడంతో అలానే నడుస్తుండడం విషాదకరం.
ప్రతి అడుగూ...కన్నీటి మడుగు
నడినెత్తిన సూరీడి మంటలు
పొట్టలో ఆకలి దప్పులు
పాదాల కింద నిప్పుల కుంపట్లు
వీపుపై మూటాముల్లె
చంకలో పసిబిడ్డలు
ఏ దారిన వెళ్తున్నాడో తెలీదు
ఎన్నటికి గమ్యం చేరతాడో అర్థంకాదు
రెండు కాళ్లే చక్రాలై..
చెట్లనక, పుట్లనక, ఎండనక, గాలనక
సుదీర్ఘ పయనం సాగిస్తున్నాడు
బొబ్బలెక్కిన కాళ్లు..
చెమటలు కక్కుతున్న దేహాలు
అలసి సొలసి
రోడ్డుపక్కనే విశ్రమిస్తున్నాయి
దాతల అన్నంతో
పసిబిడ్డల ఆకలి తీర్చి
నీటితో సరిపెట్టుకుంటున్న మాతృమూర్తులు
జానెడు పొట్ట కోసం ఊరు కాని ఊరొస్తే
మహమ్మారి తరిమింది..
వచ్చిన చోటకే పొమ్మంది
ఉన్న ఊరిని, కన్నవారిని
ఎలాగైనా చేరుకోవాలనే తపనతో
వలస జీవి సాగిస్తున్న ఎడతెగని ఈ పయనం
నిరుపేద బతుకు చిత్రానికి నిలువెత్తు దర్పణం
‘నవ భారత నిర్మాత’ల దైన్యానికి కన్నీటి సాక్ష్యం
దేశంలో లాక్‌డౌన్ మొదలైన తర్వాత పనులు దొరక్క, సరైన తిండీ లేక వలస కూలీలు అల్లాడిపోయారు. ఇక తప్పని పరిస్థితిలో సొంతూరి బాట పట్టారు. ఈమేరకు హైదరాబాద్-నాగ్‌పుర్ జాతీయ రహదారిపై ‘ఈనాడు ప్రతినిధులు’ పరిశీలించారు. అష్టకష్టాలు పడి స్వరాష్ట్రం వెళ్లినా మిగిలేది ఏదీ లేదని వారికి తెలుసు. అయినా సొంత ఊరిలో బతుక్కి భరోసా ఉంటుందన్న ఆశ ఒక్కటే వారిని నడిపిస్తోంది. లాక్‌డౌన్ నేడో, రేపో ముగుస్తుందని ఇన్నిరోజులు ఎదురు చూశామని.. రైళ్లు, బస్సులు ఏర్పాటుచేసి తరలిస్తారనుకుని చూసినా ఫలితం లేక వెళ్లిపోతున్నామని బావురుమంటున్నారు. హైదరాబాద్ నుంచి మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల వైపు వెళ్లే రోడ్లన్నీ వీరితోనే కిక్కిరిసిపోతున్నాయి.
ప్రయాణ పత్రాలిచ్చి.. నిరాశ పరిచారు
నగరం నుంచి వివిధ రాష్ట్రాలకు రైళ్లు ఏర్పాటు చేయడంతో కూలీలు పోలీస్‌స్టేషన్ల ముందు పడిగాపులు కాసి అనుమతి పత్రాలు పొందారు. ఈనెల మొదటివారంలో రసీదులు, చరవాణిలకు ఓటీపీలు అందుకున్నప్పటికీ వారికి నేటికీ రైళ్లు ఏర్పాటు చేయలేదు. ఈనెల 6వ తేదీనే రైలు ప్రయాణం అనుమతి పొందామని మధ్యప్రదేశ్‌కు చెందిన కోమల్‌సింగ్, వీరేన్ ఆదివాసీ చెప్పారు. లాక్‌డౌన్ సడలింపులతో తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి లారీలు వస్తున్నాయి. తిరిగిపోతూ కూలీలను తీసుకెళ్తున్నాయి. కనీసం రూ.800 లేనిదే చత్తీస్‌గడ్ వరకైనా తీసుకెళ్లడం లేదు. నాగ్‌పుర్‌నకు రూ.1500, బిహార్‌కు ఒక్కొక్కరికి రూ.4 వేలు, ఎక్కువమంది ఉంటే రూ.2 వేల వరకు లారీడ్రైవర్లు వసూలు చేస్తున్నారు. పశ్చిమబంగ రాష్ట్రానికి రూ.4 వేలు తీసుకుంటున్నారు. దీంతో ఇన్నాళ్లూ తినీతినక మిగుల్చుకున్న మొత్తం కూడా చేజారిపోతోందని కూలీలు పెదవివిరుస్తున్నారు.
ఎక్కువమంది బిహార్, ఝార్ఖండ్ వైపే..
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల నుంచి పరిశ్రమలు, నిర్మాణ రంగ కూలీలు పెద్దఎత్తున జాతీయ రహదారిపై వెళ్తున్నారు. నల్గొండ, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల వారు సైతం ఇదే బాట పట్టారు. జిల్లాల్లో ఇన్నాళ్లు మిషన్ భగీరథ పనులు చేసినవారు వీరికి జత కలిశారు. మొత్తంగా బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు వెళ్తున్న వారే ఎక్కువగా ఉండగా అందులోనూ యువత పెద్దసంఖ్యలో ఉన్నారు. బేల్దారీ, ఇటుక తయారీ వంటి నైపుణ్యం లేని రంగాల వారిలో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ వాసులున్నారు.
పరిమితికి మించి ఎక్కించి..
ఆహార పదార్థాలను తరలించే సంబంధించి కంటెయినర్ లారీల్లో కూలీల తరలింపు ప్రమాదకరంగా సాగుతోంది. ఒక్కో వాహనంలో కనీసం 200 మందికి తగ్గకుండా ఎక్కిస్తున్నారు.
డస్సిపోతున్న గర్భిణులు, పిల్లలు
కుటుంబాలతో సహా నగరానికి తరలివచ్చి ఇన్నాళ్లూ ఉపాధి పొందిన కూలీల కుటుంబాలు కూడా ఇప్పుడు వెనుదిరుగుతున్నాయి. నగరం నుంచి కండ్లకోయ కూడలి వరకు నడిచివచ్చి లారీలు ఎక్కుతున్నారు. బిహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు వెళ్తున్న ఒక్కో లారీలో కనీసం 15 మంది చిన్నారులు, ఐదారుగురు గర్భిణులు ఉంటున్నారని కండ్లకోయ వద్ద కొద్ది రోజులుగా సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తెలిపారు.
పనిచేస్తున్న ప్రాంతాల నుంచి రెండు రోజుల ముందే బయలుదేరి నగర శివార్లకు చేరుకుంటున్న వారు సరైన ఆహారం, నిద్ర లేక నీరసించిపోతున్నారు. గర్భిణులు, పిల్లలు ఎండలకు డస్సిపోతున్నారు. ‘నేను నిజామాబాద్ నుంచి బిహార్ వెళ్తున్నా. ఏడో నెల అయినా తప్పడం లేదు. ఇక్కడ పని లేదు. ఎలాగైనా మా ఊరు చేరుకుని పురుడు పోసుకోవాలన్నదే నా ఆశ’ అంటూ శోభాదేవి అనే గర్భిణి చెప్పింది.
రెండు నెలల్లోనే ఇలా వెళ్లాల్సి వస్తోంది..
వీపునకు బ్యాగులతో బయల్దేరిన ఈ యువకులది బిహార్. కూచారం-జీడిపల్లి వద్ద ఇలా జాతీయరహదారిపై సాగిపోతున్నారు. వీరిలో బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్‌లకు చెందిన వారు ఉన్నారు. అందరూ గచ్చిబౌలి, మాదాపూర్, పటాన్‌చెరుల్లోని పలు సంస్థల్లో పొట్టపోసుకొనే వారే. ఉపాధి కచ్చితంగా లభిస్తుందనే ఆశతో జనవరిలో హైదరాబాద్‌కు వచ్చామని శివఖేర్, నారాయణ అనే యువకులు తెలిపారు.
రెండు నెలల్లోనే ఇలా సర్దుకుని వెళ్లాల్సి వస్తుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘జాతీయ రహదారిపై ఎవరో ఒకరు ఆహారం ఇస్తున్నారంటూ మా ముందు వెళ్తున్న బృందం సభ్యులు ఫోన్‌లో చెప్పారు. ఇరవై రోజులైనా ఇలా నడిచే వెళ్తాం. ఊర్లో ఉంటే కుటుంబంతో ఉన్నామన్న ఆనందం మిగులుతుంది’’ అని విఘ్నాన్వేష్ అనే యువకుడు తెలిపారు.