సాగునీటి ప్రాజెక్టులకు ఎంతో కీలకమైన వలస కూలీలు తిరిగి పనుల బాట పడుతున్నారు. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టులో 5000 మంది వరకు కూలీలు కరోనా ముందు పని చేసేవారు. కరోనా సమయంలో కొద్ది మంది మినహా అంతా స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఇది పనుల పురోగతిపై ప్రభావం చూపింది. ఇదే సమయంలో అక్కడికి వెళ్లిన చాలా మంది వలస కార్మికులకు ఆయా రాష్ట్రాల్లో పనుల్లేక తిరిగి ఇక్కడికి వస్తామంటూ వర్తమానం పంపసాగారు. దీంతో జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలకు లేఖలు రాసి దాదాపు వేయిమందికిపైగా కూలీలను నేరుగా పోలవరానికి రప్పించారు.
ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీల్లో కొందరు కొత్తవారు కావడంతో వారు పూర్తి స్థాయి నైపుణ్యంతో పనులు చేయలేకపోతున్నారని ఒక ఇంజినీరింగు అధికారి తెలిపారు. వీటితో పాటు అక్టోబరు నెలాఖరుకల్లా 6 ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రారంభించేందుకు త్వరలో మరికొంత మంది కూలీలను రప్పిస్తున్నామని అన్నారు.