ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Microsoft : హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ డేటా కేంద్రం! - Huge data center in Hyderabad

డేటా కేంద్రాలను హైదరాబాద్‌ పెద్దఎత్తున ఆకర్షిస్తోంది. ఐటీ దిగ్గజ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ ఒక పెద్ద డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు, అదే బాటలో మరో మూడు ఐటీ కంపెనీలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

big data center in hyderabad
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ డేటా కేంద్రం

By

Published : Jul 22, 2021, 9:36 AM IST

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి సమీపంలో మైక్రోసాఫ్ట్‌ ఇండియా రూ.15,000 కోట్ల పెట్టుబడితో పెద్ద డేటా కేంద్రాన్ని నెలకొల్పనుందని సమాచారం. దీనికి సంబంధించి ఆ సంస్థ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో సాగిస్తున్న సంప్రదింపులు తుది దశకు చేరాయని తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో మూడు కంపెనీల ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. మనదేశంలో డేటా అవసరాలు రోజురోజుకూ పెరిగిపోతుండగా, వీటి స్థాపనకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఆయా సంస్థలను ఆకర్షించడంలో హైదరాబాద్‌ అగ్రగామిగా ఉన్నట్లు కన్సల్టింగ్‌ సేవల సంస్థ జేఎల్‌ఎల్‌ ఇటీవల ‘డేటా సెంటర్‌ మార్కెట్‌ అప్‌డేట్‌’ నివేదికలో పేర్కొనడం గమనార్హం.

ప్రస్తుతం మనదేశంలో 30 మెగావాట్ల మేరకు ఈ కేంద్రాల సామర్థ్యం ఉండగా, ఇది 2023 నాటికి 96 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా. ఇతర నగరాలతో పోలిస్తే స్థిరాస్తి వ్యయాలు తక్కువగా ఉండటం, ప్రభుత్వ సానుకూల విధానాలు, ఐటీ నిపుణుల లభ్యత.. తదితర కారణాలతో డేటా కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకునే కంపెనీలు హైదరాబాద్‌ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో దశాబ్దకాలంగా వీటిని కంట్రోల్‌ ఎస్‌ అనే సంస్థ నిర్వహిస్తోంది. అమెజాన్‌ ఇండియా ఇటీవల ఏర్పాటు చేసింది. ర్యాక్‌ బ్యాంక్‌ అనే మరొక సంస్థ సైతం డేటా కేంద్రాలు నెలకొల్పడానికి హైదరాబాద్‌ను ఎంచుకుంది. జాబితాలో త్వరలో మైక్రోసాఫ్ట్‌, మరికొన్ని కంపెనీలు చేరబోతున్నాయని స్పష్టమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details