దేశంలో కోవిడ్ ప్రభావం ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు మరికొన్ని కేంద్ర బృందాలు పంపాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటివరకూ పశ్చిమ బంగా, తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు అంతర్ మంత్రిత్వ శాఖల అధికారుల బృందాలను పంపిన కేంద్రం... ఈ ఆరు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సమాచారాన్ని హోం మంత్రిత్వ శాఖకు పంపడంతోపాటు.. కరోనా నియంత్రణకు స్థానిక అధికారులకు సలహాలు ఇస్తున్నాయి. ఇదే తరహాలో కరోనా ప్రభావం పెరుగుతున్న మిగిలిన రాష్ట్రాలకు కూడా కేంద్ర బృందాలు పంపనున్నట్లు తెలిసింది.
దీనిలో భాగంగా.. ఆంధ్రప్రదేశ్‌కూ కేంద్ర అధికారుల కమిటిని పంపనున్నట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్‌లో టెస్టులు పెంచుతుండటం.. దానికి అనుగుణంగా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో అధికారుల బృందాన్ని పంపాలని హోం శాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, గుంటూరు సహా ప్రభావం పెరుగుతున్న అన్ని ప్రాంతాల్లో కేంద్ర అధికారుల కమిటి పర్యటించే అవకాశాలు ఉన్నాయని హోం శాఖ వర్గాలు తెలిపాయి. అధికారిక ఉత్తర్వులు వెలువడిన వెంటనే కమిటి తన పర్యటన ప్రారంభిస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.