సమతామూర్తి కేంద్రం.. ప్రపంచంలో ఎనిమిదో అద్భుతం - చిరంజీవి Megastar Chiranjeevi in Muchintal: తెలంగాణలో శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు 11వ రోజు వైభవంగా సాగుతున్నాయి. రామానుజాచార్యుల విగ్రహం లోకార్పితం కావడంతో ముచ్చింతల్‌లోని దివ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది నుంచి భక్తులు, సందర్శకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, సందర్శకులు తరలిరావడంతో శ్రీ రామనగరం జనసంద్రంగా మారింది.
మెగాస్టార్ దంపతుల రాక..
ఇప్పటివరకు పలువురు ప్రముఖులు సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించుకోగా.. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటు నిర్మాత దిల్‌రాజు దంపతులు, దర్శకుడు హరిశ్‌శంకర్ సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. జూపల్లి రామేశ్వర్రావు తనయుడు రామ్రావు దగ్గరుండి చిరంజీవి, దిల్ రాజు దంపతులకు సమతామూర్తి కేంద్ర విశిష్టత, నిర్మాణ ప్రత్యేకతలను వివరించారు. దివ్యదేశాల్లో ఒక్కటైన శ్రీరంగం ఆలయంలో మెగాస్టార్‌కు అర్చకులు తిలకం దిద్దారు. అనంతరం భద్రవేదికపైకి చేరుకున్న చిరంజీవి.. సమతామూర్తి విగ్రహాన్ని చూసి ముగ్ధులయ్యారు.
తెలుగు ప్రాంతం పునీతం..
"ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా సమతామూర్తి కేంద్రం భావితరాల మనస్సుల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. సమతామూర్తి గొప్ప మానవతామూర్తి. ఆరేళ్ల వ్యవధిలోనే ఇంత ఆమోఘంగా సమతామూర్తి కేంద్రాన్ని నిర్మించడం మహాద్భుతం. ఈ దివ్యక్షేత్ర నిర్మాణంతో తెలుగు ప్రాంతం పునీతమైంది. వెయ్యేళ్ల తర్వాత కూడా ఇంతటి గొప్ప క్షేత్రం నిర్మితం అవడం దైవసంకల్పమే. ప్రధాని, ఉప రాష్ట్రపతి అన్నట్లు సమతామూర్తి కేంద్రం ప్రపంచంలో ఎనిమిదో అద్భుతం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు." - మెగాస్టార్ చిరంజీవి
కిలోమీటర్ మేర భక్తుల బారులు..
Ramanuja Sahasrabdi Utsav: పదకొండో రోజు సందర్భంగా.. శ్రీరామనగరంలో జరుగుతున్న నిత్యపూజలు, యాగాలకు దేశం నలుమూలల నుంచి స్వామీజీలు, పీఠాధిపతులు వచ్చారు. సమతామూర్తి కేంద్రాన్ని తిలకించెేందుకు వేలాదిగా భక్తులు తరలిచ్చారు. కిలోమీటర్ మేర సందర్శకులు బారులు తీరారు. భీష్మఏకాదశి సందర్భంగా 114 యాగశాలల చుట్టూ చినజీయర్ స్వామి అధ్వర్యంలో రుత్వికులు ప్రదక్షిణ చేశారు.
రేపు ఒంటి గంట వరకే..
సమతామూర్తిని సందర్శించేందుకు రేపు రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో.. కేంద్రంలోని భద్రతా ఏర్పాట్లను సీపీ స్టీఫెన్ రవీంద్ర పర్యవేక్షించారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంట వరకే భక్తులకు అనుమతి ఉండనున్న దృష్ట్యా.. నేడు పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు.
ఇదీ చూడండి: