Chiranjeevi on Cinema Tickets Price: తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ధరలు సవరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. థియేటర్ల మనుగడకు, వేలాది మంది కార్మికులకు ఎంతో మేలు చేసే నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేశారని ట్విటర్ వేదికగా అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ కోరికను మన్నించి కేసీఆర్ సత్వరమే నిర్ణయం తీసుకోవడం పట్ల మెగాస్టార్ సంతోషం వ్యక్తం చేశారు. నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యాజమాన్యానికి న్యాయం జరిగేలా టికెట్ ధరలను సవరించడం ఆనందంగా ఉందన్నారు.
Chiranjeevi on Cinema Tickets Price Hike : తెలంగాణలో సినిమా టికెట్ ధరలు పెరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ యాజమాన్యాలకు టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలుగా అనుమతిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏసీ థియేటర్లలో టికెట్ ధర కనిష్ఠంగా 50 రూపాయలు, నాన్ ఏసీ థియేటర్లలో 30 రూపాయలు పెంచుకోవచ్చని సూచించింది. అలాగే మల్టీప్లెక్స్‌లలో కనిష్ఠంగా టికెట్ ధర జీఎస్టీతో కలిపి 100 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఏసీ థియేటర్లలో గరిష్ఠంగా 150 రూపాయలు, నాన్ ఏసీ థియేటర్లలో 70 రూపాయలు పెంచుకోవచ్చని సూచించింది. సింగిల్ థియేటర్లలో స్పెషల్ సీట్లకు జీఎస్టీ అదనంగా 200, స్పెషల్ ఐమ్యాక్స్ లేదా అతి పెద్ద తెర ఉన్న సింగిల్ థియేటర్లలో 250 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 300 రూపాయలు గరిష్ఠంగా పెంచుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే నిర్వహణ ఛార్జీల కింద ఏసీ థియేటర్లలో 5 రూపాయలు, నాన్ ఏసీకి 3 రూపాయలు వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.