పండుగ సందర్భంగా మహిళలు వస్త్ర దుకాణాలకు పోటెత్తుతున్నారు. ఈ హడావుడిలో దుకాణపు యజమానులు కొవిడ్ నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని యూబీ రోడ్డులో ఉన్న యువతి ఫ్యాషన్ వస్త్ర దుకాణంలో భారీ ఆఫర్లు పెట్టగా... మహిళలు, యువతులు పెద్దసంఖ్యలో వచ్చారు. ఒక్కో డ్రెస్సు రూ.39కే ఇస్తున్నామని ఆఫర్ పెట్టడం వల్ల సుమారు 500 మందికి పైగా మహిళలు, యువతులు దుకాణంలోకి ఎగబడ్డారు.
రూ.39కే డ్రెస్: కొనేందుకు ఎగబడ్డ మహిళలు... దుకాణం బంద్ - dress only rs39
తెలంగాణలోని భద్రాచలంలోని ఓ వస్త్ర దుకాణం ఇప్పుడు చర్చనీయాంశమైంది. భారీ మొత్తంలో ఆఫర్లు పెట్టగా... పెద్దఎత్తున ఎగబడి బీభత్సం సృష్టించారు. ట్రాఫిక్కు సైతం స్తంభింపజేశారు. వీరి హడావుడి చూసి స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడి పోలీసులకు సమాచారమివ్వగా... రంగప్రవేశం చేసి ఏకంగా దుకాణాన్నే మూసేయించారు.
కనీసం మాస్కులు కూడా ధరించకుండా... ఒకరినొకరు తోసుకుంటూ డ్రెస్సులు కొనేందుకు ఉత్సాహం చూపించారు. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో... కొంచెం కూడా భయం లేకుండా ఇలా డ్రెస్సుల కోసం మహిళలు ఎగబడటాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.
దుకాణం యజమానిపై స్థానికులు మండిపడ్డారు. ఇంతమంది గుంపులో ఒకరికి కరోనా ఉన్న అందరికీ సోకే ప్రమాదం ఉందని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకుని దుకాణాన్ని తాత్కాలికంగా మూసివేశారు. దుకాణానికి భారీగా మహిళలు కదలి రావడం వల్ల సుమారు గంట సేపు ఆ రోడ్డులో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.