నదుల అనుసంధానంపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీ దీనిపై ఈ నెల 25న చర్చించనుంది. కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ సలహాదారు, నదుల అనుసంధాన కమిటీ ఛైర్మన్ వెదిరే శ్రీరాం అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేంద్రజలసంఘం ఛైర్మన్, ఎన్.డబ్యు.డి.ఎ. డైరెక్టర్ జనరల్‌తో సహా 11 మంది సభ్యులు, పది మంది ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొననున్నారు. దేశంలోని పలు అనుసంధానాలపై ఈ కమిటీ చర్చించనున్నా, ఎజెండాలో గోదావరి-కావేరికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇచ్చంపల్లి వద్ద 175 టీఎంసీల నీటి మిగులు ఉంటుందని, ఛత్తీస్‌గఢ్‌కి కేటాయించి వాడుకోలేని నీరు సైతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇదే అనువైన ప్రాంతంగా భావిస్తున్నట్లు తెలిసింది. దీనివల్ల తెలంగాణలో ఎక్కువ ఆయకట్టుకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.
ఒక బేసిన్ నుంచి ఇంకో దానికి మళ్లింపు..
గోదావరి-కావేరి అనుసంధానం ప్రత్యామ్నాయంలో భాగంగా గోదావరి-కృష్ణా, కృష్ణా-పెన్నా, పెన్నా-కావేరి అనుసంధానాల సమగ్ర ప్రాజెక్టు నివేదికల(డీపీఆర్‌లు)ను తయారుచేసిన ఎన్.డబ్ల్యు.డి.ఎ. వాటిని 2019 మార్చిలో భాగస్వామ్య రాష్ట్రాలకు అందజేసింది. 2020 సెప్టెంబరులో జరిగిన సమావేశంలో రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకొని నివేదికలను సవరించింది. 2050 వరకు బేసిన్ పరిధిలో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలన్నింటినీ పరిగణనలోకి మిగిలిన నీటిని ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్‌కు మళ్లించాలని ప్రతిపాదించింది.
2018 మార్చిలో ఎన్.డబ్ల్యు.డి.ఎ. చేసిన అధ్యయనం ప్రకారం 75 శాతం నీటి లభ్యత కింద శ్రీరామసాగర్-ఇచ్చంపల్లి మధ్య 175 టీఎంసీల మిగులు ఉంటుందని తేల్చింది. 1989 నాటి అధ్యయనం మేరకు 713.22 టీఎంసీలు, 1990లో శ్రీరామసాగర్-పోలవరం మధ్య జరిగిన అధ్యయనం ప్రకారం 526.9 టీఎంసీల మిగులు ఉందని పేర్కొంది. తాజా అధ్యయనం ప్రకారం నీటి లభ్యత తగ్గడానికి కారణం ఇంద్రావతి నది గోదావరిలో కలవడానికి ఎగువన, దిగువన తెలంగాణ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలను చేపట్టడమేనంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు గోదావరి నీటిని పక్కబేసిన్‌లో వినియోగించుకోవడానికి సైతం పలు ఎత్తిపోతల పథకాలను చేపట్టాయని నివేదికలో వెల్లడించింది.
ప్రత్యామ్నాయాలు..
గోదావరిలో 75 శాతం నీటి లభ్యతకు మించి వచ్చే నీటిలో 65 శాతం వరకు పరిగణనలోకి తీసుకోవడం, ఇంద్రావతి సబ్ బేసిన్‌లో వినియోగించుకోకుండా ఉన్న నీటిని నదుల అనుసంధానంలో భాగంగా మళ్లించడం, క్రమంగా మహానది నుంచి గోదావరికి నీటిని మళ్లించడం ఇలా పలు ప్రత్యామ్నాయాలను ఎన్.డబ్ల్యు.డి.ఎ. ప్రతిపాదించింది. మొదటి దశలో గోదావరి మిగులు జలాలతో చేపట్టడం, రెండో దశలో మహానది నుంచి నీటిని మళ్లించడం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలకు ఇందులో చోటు కల్పించడం చేయాలని సూచించింది. గోదావరి నుంచి కావేరి వరకు మళ్లించే నీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వినియోగించుకొనేలా ప్రతిపాదన ఉండగా, కర్ణాటక, కేరళలు కూడా వాటా కోరుతున్నాయి. దీనిపైనా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.