క్యాన్సర్ రోగులకు డాక్సోరుబిసిన్ 10ఎంజీ, 5ఎంఎల్ ఇంజక్షన్లు, పాస్లిటాక్సెల్ ఇంజక్షన్ 30 ఎంజీ, 5 ఎంఎల్ అవసరం ఎక్కువ. వీటిని సరఫరా చేయాలని గుంటూరు సర్వజనాసుపత్రి వైద్యులు అక్కడే ఉన్న కేంద్ర ఔషధ నిధి (సీడీఎస్) అధికారులను కోరారు. సీడీఎస్‌లో ఆ మందులు డబ్బాలకొద్దీ ఉన్నప్పటికీ.. ఇప్పటికే మీకు కేటాయించిన కోటా వాడేశారంటూ(medicines reaching expiry date in name of quota) ఇవ్వడం లేదు. ఇదే సీడీఎస్‌లో వేర్వేరు బ్యాచ్ నంబర్లతో సుమారు 2400 ఇంజక్షన్లు ఉన్నాయి. సెప్టెంబరుతో కాలంచెల్లే వీటిని ఆసుపత్రులకు అందించలేదు. ఇప్పటికిప్పుడు ఇచ్చినా.. అవి రోగులు వాడుకునేందుకు గడువు చాలదు. ఈ ఇంజక్షన్లను కొన్నాళ్లుగా రోగులు ప్రైవేటు దుకాణాల్లో కొనుక్కుంటున్నారు. కొన్ని ఔషధాలు సీడీఎస్‌లో ఉన్నప్పటికీ.. జీజీహెచ్‌కు ఇవ్వనందున అధికారులు బయటినుంచి కొని తెప్పించారు. ఆ బిల్లులు రూ.80 లక్షలు పేరుకుపోయాయి. దీంతో వ్యాపారులు కొత్తగా మందులు ఇవ్వడం లేదు.
గుంటూరులోని సీడీఎస్‌లో ప్రస్తుతం ఔషధాలు, ఇంజక్షన్లు, సర్జికల్స్ నిల్వలు నిండిపోయాయి. గాలి, వెలుతురు చొరబడనంతగా గదుల నిండా మందుల పెట్టెలను గుట్టలుగా పేర్చారు. ఆసుపత్రులకు కేటాయించిన నిర్దేశిత బడ్జెట్ అయిపోతే.. స్థానికంగా ఇండెంట్ పెట్టుకోవడానికి వీల్లేకుండా ఈ-ఔషధి ఆన్‌లైన్ విధానం ఉంది. దీన్ని ఉన్నతాధికారులు సవరించడం లేదు. దీంతో రెండు మూడు నెలలుగా సాధారణ, క్యాన్సర్ రోగులకు మందులు కావాలని ఆసుపత్రి వర్గాలు కోరినా.. సీడీఎస్ నుంచి పంపించడం లేదు. నిబంధనల సాకుతో గోదాములోనే మగ్గబెడుతున్నారు. గుంటూరు జీజీహెచ్‌కు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రోగులు వస్తుంటారని తెలిసినా.. కోటా పెంచలేదు. ఇవే మందులు అనంతపురం, కర్నూలు, కాకినాడ, విశాఖ ఆసుపత్రుల్లోనూ ఉన్నాయి. వాటిని మళ్లించడం లేదు. ప్రమాద బాధితులకు డ్రెస్సింగ్ చేయడానికి, కుట్లు వేయడానికి వాడే సుచర్ మెటీరియల్ లేదు. ఎమర్జెన్సీ, గైనిక్ ఓటీల్లో వీటి కొరతపై పీజీ వైద్యులు రెండు, మూడుసార్లు ఉన్నతాధికారులకు చెప్పినా సమస్య పరిష్కారం కాలేదు.
దుమ్ము, ధూళీ పడుతున్నా..