MEDICAL TESTS TO DARAPANENI : సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన విషయంలో తెలుగుదేశం రాష్ట్ర మీడియా సమన్వయకర్త.. దారపనేని నరేంద్రను సీఐడీ అధికారులు కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కొద్ది సేపటి క్రితం ఆయన్ను గుంటూరు సర్వజనాస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉదయం సీఐడీ కార్యాలయానికి వైద్యులను పిలిపించిన అధికారులు.. ఇప్పుడు జీజీహెచ్‌కు తరలించారు. సీఐడీ కార్యాలయం ఎదుట మీడియా ప్రతినిధులు, తెలుగుదేశం నేతలు ఉండటంతో అధికారులు.. ఆఫీస్ వెనుక వైపు నుంచి జీజీహెచ్‌కి తీసుకెళ్లారు. వైద్యుల నివేదిక తీసుకుని.. నరేంద్రను రిమాండ్‌కు పంపించాలని సీఐడీ అధికారులు కోరనున్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే:తెలుగుదేశం కేంద్ర కార్యాలయ మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్రను.. బుధవారం రాత్రి సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు గుంటూరు అరండల్‌పేట యాగంటి అపార్ట్‌మెంట్స్‌లోని నివాసానికి చేరుకున్న సీఐడీ అధికారులు.. రెండు గంటలపాటు నరేంద్రను ప్రశ్నించారు. అనంతరం ఆయన్ని అరెస్ట్ చేసి.. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అరెస్టుకు ముందు నరేంద్రకు సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఆయన భార్య సౌభాగ్యలక్ష్మికి అరెస్ట్ విషయం చెప్పి నరేంద్రను తీసుకెళ్లారు. ఆయనపై 153A, 505, 120B సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు.
గన్నవరం విమానాశ్రయంలో పట్టుబడిన బంగారం వ్యవహారంపై.. సీనియర్ పాత్రికేయుడు కొల్లు అంకబాబు గతంలో ఓ పోస్టును షేర్ చేశారు. దాన్ని నరేంద్ర కూడా షేర్ చేశారంటూ సీఐడీ అధికారులు అభియోగాలు మోపారు. రెండు రోజుల క్రితం విజయవాడకు చెందిన ఓ వైద్యుడిని సీఐడీ అధికారులు విచారించారు. బంగారం పట్టుబడిన వ్యవహారంపై నరేంద్ర నుంచి పోస్టు వచ్చినట్లు విచారణలో ఆయన వెల్లడించారు. ఆ మేరకు కేసు నమోదు చేసి నరేంద్రను అరెస్ట్ చేశారు. తన భర్త చేసిన తప్పేంటో చెప్పకుండా బలవంతంగా తీసుకెళ్లారని నరేంద్ర భార్య ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతన్నారు.