Medical staff irresponsibility: మానవత్వమే మొదటి లక్షణం వారిది.. కారణాలు చూపకుండా కాపాడాల్సిన బాధ్యత వాళ్లది.. ప్రాణాంతక రోగాలతో పోరాడి రోగులను కాపాడాల్సిన యోధులు వాళ్లు.. వైద్యసిబ్బంది గురించి మనమంతా.. ఇంత గొప్పగా చెప్పుకుంటుంటే.. వీళ్లు మాత్రం ఇవన్నీంటినీ మడిచి చెత్తబుట్టలో పడేశారు. కనికరమే లేకుండా.. కారణాలు చెప్పి చేతులు దులిపేసుకున్నారు. హెచ్ఐవీ ఉందన్న కారణంతో గర్భిణీకి ప్రసవం చేయకుండా నిరాకరించి.. పొడిగిన నోళ్లతోనే తిట్టించుకుంటున్నారు.
ఈ అమానుష ఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. కోదాడకు చెందిన ఓ మహిళకు నెలలు నిండి పురిటి నొప్పులు రావడంతో సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. ముందు చేసిన పరీక్షల రిపోర్టులు పరిశీలించగా.. బాధితురాలికి హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. ప్రసవం చేసేందుకు తమ దగ్గర కిట్లు లేవని వైద్యసిబ్బంది చెప్పారు. వెంటనే సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని బాధితురాలి కుటుంబసభ్యులకు సూచించారు.
చేసేదేమీలేక పురిటి నొప్పులతో తల్లడిల్లిపోతున్న బాధితురాలిని కుటుంబసభ్యులు హుటాహుటిన 108లో సూర్యాపేటకు పయనమయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే మహిళకు ప్రసవమైంది. పండంటి మగబిడ్డకు బాధితురాలు జన్మనిచ్చింది. కానీ.. సకాలంలో ఆసుపత్రికి చేరుకోకపోవడంతో శిశువు పరిస్థితి విషమించింది. వెంటనే.. శిశువును హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.