ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

medical-seats: ఒక్కో సీటుకు సగటున 8 మంది.. - ఆంధ్రప్రదేశ్​లో మెడికల్ సీట్ల వివరాలు

Medical seats:రాష్ట్రంలో వైద్య సీట్లు పెరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 5,060 వైద్య సీట్లు అందుబాటులో ఉండగా.. అదనంగా మరో 150 సీట్లు పెరగనున్నాయి. నీట్‌లో 40,344 మంది అర్హత సాధించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 5,060 సీట్లలో ఒక్కోదానికి సగటున ఏడెనిమిది మంది పోటీపడుతున్నారు.

Medical seats
ఆంధ్రప్రదేశ్​లో పెరగనున్న వెద్య సీట్లు

By

Published : Sep 9, 2022, 8:53 AM IST

Medical seats: రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్‌ సీట్లు 150 వరకు పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కలిపి 5,060 సీట్లున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185, మైనారిటీతో కలిపి ప్రైవేటు వైద్య కళాశాలల్లో 2,700, స్విమ్స్‌ (తిరుపతి)లో 175 సీట్ల చొప్పున ఉన్నాయి. ఈ కొత్త విద్యా సంవత్సరంలోనే రేణిగుంటలోని బాలాజీ వైద్య కళాశాలలో 150 సీట్లతో ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు ఎన్‌ఎంసీ నుంచి అనుమతి పొందే ప్రక్రియ చివరి దశలో ఉందని ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి 68,061 మంది నీట్‌కు దరఖాస్తు చేయగా 65,305 మంది హాజరయ్యారు. వీరిలో 40,344 మంది (61.77%) మంది అర్హత సాధించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 5,060 సీట్లలో ఒక్కో దానికి సగటున ఏడెనిమిది మంది పోటీపడుతున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న 2,185 సీట్లలో 325 జాతీయ కోటా ద్వారా భర్తీ చేస్తారు. వీటిలో ఏవైనా మిగిలితే మళ్లీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతారు. మిగిలిన 1,860 సీట్లను కన్వీనర్‌ కోటా కింద భర్తీచేస్తారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్న 2,700 సీట్లలో 1,350 కన్వీనర్‌ కోటా, 938 బీ కేటగిరీ, 412 సీట్లను సీ కేటగిరీలో భర్తీచేస్తారు. తిరుపతి స్విమ్స్‌లో 152 సీట్లను కన్వీనర్‌ కోటాలో, 23 సీట్లను యాజమాన్య కోటాలో భర్తీ చేస్తామని విశ్వవిద్యాలయం తెలిపింది. ప్రస్తుత పోటీలో సీట్లు పొందలేనివారు దంత, ఆయుర్వేద వైద్యవిద్యలో ప్రవేశాలు పొందుతారు. నీట్‌ ‘కీ’ ఆధారంగా మార్కులపై అవగాహనకు వచ్చి, సీటు రాదనుకునేవారు ఇప్పటికే దీర్ఘకాల శిక్షణలో చేరారు.

2021-22 విద్యా సంవత్సరంలో ఓసీ కేటగిరీలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో సీట్లు పొందిన వారి నీట్‌ చివరి ర్యాంకు కళాశాలను అనుసరించి మారింది. 15,824 (607 మార్కులు) నుంచి 61,017 (529) మధ్య ర్యాంకులు పొందిన వారికి ఈ సీట్లు లభించాయి. ప్రైవేటు వైద్య కళాశాలల్లో బీ కేటగిరీలో సీట్లు పొందినవారి ర్యాంకు 1,98,375 (మార్కులు-395) వరకు ఉంది. రాష్ట్రంలో ఉన్న రెండు మైనారిటీ కళాశాలల్లో సీట్లు పొందిన చివరి విద్యార్థి ర్యాంకు 3,60,463. బీ కేటగిరీలో సీట్ల కేటాయింపు 1,26,241 (ర్యాంకు) నుంచి మొదలైంది. సీ కేటగిరీలో 9,00,083 ర్యాంకు పొందిన విద్యార్థి సీటు పొందారు. ఆ విద్యార్థికి వచ్చిన మార్కులు 112. శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో ఎన్నారై కోటాలో చివరి సీటు పొందిన విద్యార్థి ర్యాంకు 9,21,062 (మార్కులు-108) కావడం గమనార్హం.

ఫీజుల వివరాలు

"2021-22 విద్యా సంవత్సరంలో కన్వీనర్‌ కోటా కింద 13,135 మంది, యాజమాన్య కోటాలో సీట్ల కోసం 3,665 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఏ, బీ, సీ కేటగిరీల్లో చివరి సీట్లు పొందిన విద్యార్థుల ర్యాంకుల వివరాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో పెట్టాం. ఈ వివరాలు అవగాహన కోసమేనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గ్రహించాలి. కేంద్రం నుంచి రాష్ట్రస్థాయి ర్యాంకర్ల జాబితా వచ్చేందుకు ఇంకొంత సమయం పడుతుంది. వాటిని ప్రకటించిన తర్వాత విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తాం. కేంద్రం ప్రకటించే తేదీలను బట్టి కౌన్సెలింగ్‌ ఉంటుంది". - డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు రిజిస్ట్రార్‌, ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details