తగ్గుతున్న ఆక్సిజన్ నిల్వలు దేశంలో కరోనా సెకెండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రతి చోటా వినిపిస్తున్న మాట ఆక్సిజన్ కొరత. చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ సిలిండర్ల కోసం క్యూలైన్లలో నిల్చుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఆక్సిజన్ సిలిండర్లు ఉంటేగానీ, కొవిడ్ బాధితుల్ని ఆసుపత్రుల్లోకి చేర్చుకోవట్లేదు. కొవిడ్ రెండో ఉద్ధృతిలో ఎక్కువ మందికి ఆక్సిజన్ అవసరం అవుతుండటంతో డిమాండ్ పెరిగిపోయింది. గతేడాది 41.5శాతం రోగులకు ఆక్సిజన్ అవసరం కాగా.. ఇప్పుడు 54.5శాతానికి పెరిగినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ డిమాండ్ 5వేల మెట్రిక్ టన్నులకు చేరింది. 12కి పైగా రాష్ట్రాల్లో మెడికల్ ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది.
కొరతకి ఉదాహరణ
ఆక్సిజన్ కొరత తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ... బుధవారం జరిగిన నాసిక్ ఘటనే ఉదాహరణ. ప్రాణాలు కాపాడాల్సిన ఆక్సిజన్ అందక 24 జీవితాలు గాలిలో కలిసిపోయాయి. జకీర్ హుస్సేన్ మున్సిపల్ ఆసుపత్రి ఆవరణలో స్టోరేజీ ప్లాంటు నుంచి ఆక్సిజన్ లీకైంది. దీంతో... ప్రధాన స్టోరేజీ ట్యాంకు పనితీరు దెబ్బతిని.. కొవిడ్ రోగులకు అందాల్సిన అక్సిజన్ సరఫరా హఠాత్తుగా నిలిచిపోయింది. ఆ సమయంలో ఆసుపత్రిలో 150 మంది వరకు రోగులున్నారు. వీరిలో 23 మంది వెంటిలేటర్‌పై ఉన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న కొవిడ్ రోగులకు సరఫరా నిలిచిపోవడంతో.. వారికి శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అయి.. ప్రాణాలు విడిచారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ కొరత సమస్య వెంటాడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కొరత వీలైనంత మేర అదుపులోనే ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణలో రోజుకు 384 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉండగా.. ప్రస్తుతం 260 నుంచి 270 టన్నుల ఆక్సిజన్ మాత్రమే వస్తుందని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేస్తోంది. లక్షణాలున్నవారిలో అత్యధికులకు ఆక్సిజన్ అవసరం అవుతుండటంతో... రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ పడకలు వేగంగా నిండుకుంటున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎమ్సీతో పాటు... నిజమాబాద్ వంటి జిల్లాల్లోనూ ఆక్సిజన్ పడకలకు కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో.. ఆక్సిజన్ కొరత ఉందని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పలుమార్లు ప్రస్తావించడం పరిస్థితికి అద్దం పడుతోంది.
కొవిడ్ పంజా...
కరోనా పంజా విసురుతున్న మహారాష్ట్రలో అయితే.. పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఇక్కడ దాదాపు 6 లక్షలకు పైగా యాక్టివ్ కేసులుంటే...దాదాపు 10% అంటే 60 వేల మందికి ఆక్సిజన్ అవసరం ఉంది. ప్రస్తుతం...మహారాష్ట్రలో ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం 1250 టన్నులు ఉంటే... వినియోగం కూడా ఆ స్థాయికి చేరింది. మధ్యప్రదేశ్‌లోనూ ఆక్సిజన్ డిమాండ్ 250 టన్నులకు చేరింది. ఇక్కడ, ఓ ఆసుపత్రిలో మెడికల్ ఆక్సిజన్ సిలిండర్ల దొంగతనం జరిగింది. దీనిని బట్టే చెప్పొచ్చు... పరిస్థితి అక్కడ ఎలా ఉందో. అలాగే, మధ్యప్రదేశ్‌కు సొంతంగా ప్లాంట్ లేదు. దీంతో గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఆక్సిజన్ సరఫరా చేసుకుంటుంది. అయితే, ఆయా రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతుండటంతో రానున్న రోజుల్లో ఆక్సిజన్ కొరత మరింతగా పెరిగే ప్రమాదముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దేశ రాజధాని దిల్లీలోనూ ఆక్సిజన్ సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది. కొన్ని అసుపత్రుల్లో కొన్ని గంటలకు సరిపడే ఆక్సిజన్ మాత్రమే ఉంది. ప్రముఖ సరోజ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ నిల్వలు దాదాపు ఖాళీ అయ్యాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అత్యవసరంగా దిల్లీకి ఆక్సిజన్ సరఫరా పెంచాలని దిల్లీ సీఎం కేజ్రివాల్ కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో... దిల్లీ కోటాను కేంద్రం 480 టన్నులకు పెంచింది. కానీ, దిల్లీకి రోజు 700 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంది. ఈ మాత్రం సరిపోదని కేజ్రీవాల్ చెబుతున్నారు. అలాగే, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, తమిళనాడు, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది.
నాలుగింతలు పెరిగిన సరఫరా
దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ సరఫరా రెండు నెలల్లో నాలుగింతలు పెరిగిందని కేంద్రం పేర్కొంది. ఫిబ్రవరి చివరి వారంలో ఒక్కోరోజు 1,273 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ సరఫరా కాగా.. ఏప్రిల్ 17 నాటికి 4,739 మెట్రిక్ టన్నుల వరకు సరఫరా చేసినట్లు తెలిపింది. అయినప్పటికీ అవసరాల మేరకు సరిపోక ఈ విషయంలో రాష్ట్రాల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత నివారణకు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా చర్యలు తీసుకోలేకపోయిందని దిల్లీ హైకోర్టు కూడా మండిపడింది. సుప్రీం కోర్టు సైతం ఆక్సిజన్ కొరతపై ఆవేదన వ్యక్తం చేసింది. పరిస్థితి జాతీయ అత్యవసర స్థితిని తలపిస్తోందని అభిప్రాయపడింది.
కేంద్ర ప్రభుత్వం మాత్రం తమ శక్తిమేర అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేస్తోంది. విదేశాల నుంచి 50వేల మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ దిగుమతి చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం.. రోజూ 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో... ఆసుపత్రులకు వచ్చే కొవిడ్ బాధితులు సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో... ఆక్సిజన్ ఉత్పత్తి పెంచడం...సరఫరాలో ఆటంకాలు అధిగమించడం... బ్లాక్ మార్కెట్ దందా వంటి సవాళ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అధిగమిస్తాయన్నది కీలకంగా మారింది.
ఇదీ చదవండి:విశాఖ నుంచి మహారాష్ట్రకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్