తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య సమాచారం (హెల్త్ ప్రొఫైల్) తయారు చేయడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎం, అంగన్వాడీలతో ర్యాపిడ్ రెస్పాన్స్ టీం (ఆర్‌ఆర్‌టీ) ఏర్పాటు చేశారు. వానా కాల వ్యాధుల నుంచి రక్షణతోపాటు భవిష్యత్తులో మెరుగైన వైద్య సేవలందించేందుకు వీరు రూపొందించే నివేదికలు ఉపయోగపడతాయని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో సీజనల్ వ్యాధులు అధికమే...
ప్రతి వర్షా కాలంలో జిల్లాలోని ప్రజలు అంటు వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు. వైద్యాధికారుల లెక్కల ప్రకారం గత సంవత్సరం 190 డెంగీ, చికెన్ గున్యా 10, మలేరియా 9 కేసులు నమోదు అయ్యాయి. ఇవి కాకుండా జలుబు, జ్వరం, దగ్గుతో బాధ పడిన వారి సంఖ్య వేలల్లోనే ఉంది.
వృద్ధులు, పిల్లలపై ప్రత్యేక దృష్టి...
హెల్త్ ప్రొఫైల్ తయారీలో ప్రత్యేకంగా పిల్లలు, వృద్ధుల (హైరిస్క్ గ్రూప్) ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. వారిని ఎప్పటి కప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆశా, ఏఎన్‌ఎం, ఆసుపత్రుల వివరాలు వారికి అందుబాటులో ఉండే విధంగా, అవసరమైన చికిత్సలు అందించేందుకు సిద్ధమవుతున్నామని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.
వలస కుటుంబాలపై పర్యవేక్షణ...
లాక్‌డౌన్ సమయంలో జిల్లాకు చెందిన సుమారు పది వేల మంది వరకు వివిధ రాష్ట్రాల నుంచి వారి స్వస్థలాలకు చేరుకున్నారు. ఇటువంటి వారిని రాష్ట్ర సరిహద్దులో గుర్తించి, హోం క్వారంటైన్ చేశారు. ఇంటికి వచ్చిన తరువాత ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయమై వైద్యారోగ్య శాఖ క్షుణ్ణంగా పర్యవేక్షిస్తోంది.