ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మే డే!

రాష్ట్ర వ్యాప్తంగా మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాల్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నాయకులు జెండాలు ఎగురవేసి నినాదాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంఘాల హక్కులను కాలరాస్తున్నాయంటూ నాయకులు మండిపడ్డారు. కార్మికుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ప్రత్యేక చట్టాలను తీసుకు రావాలన్నారు. అంతేకానీ ఉన్న చట్టాలను రద్దు చేస్తే ఉద్యమిస్తామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు.

may day celebrations in andhra pradesh
రాష్ట్ర వ్యాప్తంగా మేడే వేడుకలు

By

Published : May 1, 2021, 9:24 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా మేడే వేడుకలను కార్మిక సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. పలు కూడళ్లలో జెండాలు ఆవిష్కరించి స్వీట్లు పంచుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను హరిస్తున్నాయంటూ నాయకులు మండిపడ్డారు.

ఒంగోలులో...

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో సీపీఐ జిల్లా సమితి కార్యాలయంలో మేడే వేడుకులను ఘనంగా నిర్వహించారు. కార్యలయంలో ఎర్ర జెండాను ఆవిష్కరించి నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాల వల్ల రైతాంగానికి.. దానితో ముడిపడి ఉన్న కార్మిక లోకానికి ఎంతో నష్టం వాటిల్లుతుందని నేతలు మండిపడ్డారు.

కర్నూలు జిల్లాలో..

కర్నూలులో కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని అన్ని కూడళ్లలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండాలను ఎగురవేశారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో.. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు యం.ఏ. గఫూర్ పార్టీ జెండాను ఎగురవేశారు. కార్మికుల హక్కులకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు.

పారిశుద్ధ్య కార్మికులకు పెంచిన వేతనాలు త్వరలో అమలవుతాయని కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా ప్రభుత్వ వైద్యశాల సమన్వయకర్త డాక్టర్​ రామకృష్ణ తెలిపారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏఐటీయూసీ నాయకులు ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వారం రోజుల్లో పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.

ఎమ్మిగనూరులో కార్మికుల దినోత్సవాన్ని వామపక్షాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కార్మిక జెండాలను ఆవిష్కరించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రం రద్దు చేసి కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తుందని వామపక్షాలు నాయకులు రాముడు, పంపన్న గౌడ్ విమర్శిచారు.

కడప జిల్లాలో...

కార్మికుల హక్కుల కోసం ఉద్యమించాలని కడప జిల్లా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కడప రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే గూడ్స్ యూనియన్ కార్యాలయం వద్ద జెండా ఎగరవేశారు. కార్మికులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన చట్టాలను కేంద్రం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

బద్వేల్ పట్టణంలో మేడే సందర్భంగా సీపీఎం, సీపీఐ పార్టీ నాయకులు జెండా ఎగురవేశారు. ఎనిమిది గంటల పని దినాలు 12 గంటలకు పెంచి శ్రమ దోపిడీ చేస్తున్నారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ విమర్శించారు.

విజయవాడలో...

విజయవాడ నగర శివారు వాంబే కాలనీలో సీపీఐ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొన్ని ఏళ్లక్రితం నిర్మించుకున్న దిమ్మెను శుక్రవారం వీఎమ్​సీ సిబ్బంది ధ్వంసం చేశారని నాయకులు ఆరోపించారు. ధ్వంసమైన దిమ్మె ప్రాంతంలో ముఖానికి నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

తిరుమల - తిరుపతిలో...

మే డే సందర్భంగా తిరుమలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం శానిటైజర్లు, మాస్కులు, హెల్త్ కేర్ కిట్లను తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి ప్రజలను పీడుస్తున్నా కూడా పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారని.. వారికి ఆయురారోగ్యాలు కలగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తితిదే పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుపతి గ్రామీణ మండలం ఎంపీడీవో కార్యాలయంలో శనివారం 16 లక్షల మాస్కులను ప్రజలకు అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

విశాఖ జిల్లాలో...

అమరవీరుల స్ఫూర్తితో దేశంలో కార్మిక హక్కులను పరిరక్షించుకోవాలని సీఐటీయూ విశాఖ జిల్లా పూర్వ అధ్యక్షుడు అజ శర్మ అన్నారు. కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా అయన విశాఖలోని సీపీఎం నగర కార్యాలయం ఎదుట అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

తూర్పుగోదావరి జిల్లాలో..

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మేడే వేడుకలు కార్మికులు ఘనంగా నిర్వహించుకున్నారు. రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లోని ఆయా వ్యాపార సంస్థల వద్ద కార్మికులు కార్మిక జెండాను ఎగురవేశారు. కార్మికులు మిఠాయిలు పంచుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో...

తణుకులో ప్రపంచ కార్మిక దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కొవిడ్ ఉద్ధృతి కారణంగా నిబంధనలకు అనుగుణంగా వేడుకలు జరిపారు. వామపక్ష అనుబంధ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, సీఐటీయూల ఆధ్వర్యంలో పలు కార్మిక సంఘాల కార్యాలయాల వద్ద వేడుకలు నిర్వహించారు. కార్మిక పతాకాన్ని ఆవిష్కరించి కార్మిక సంఘం ఐక్యం కావాలంటూ నినాదాలు చేశారు.

నెల్లూరులో..

నగరంలోని పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి వామపక్ష నేతలు పూలమాలవేసి నివాళులర్పించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పలు సెంటర్లలో ఎర్ర జెండాలు ఎగురవేసి మేడే విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్రా రాజగోపాల్​తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

రెమ్​డెసివిర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముఠాలు అరెస్టు

'కరోనాపై నిమ్మకు నీరెత్తినట్లుగా కేంద్రం'

ABOUT THE AUTHOR

...view details