Scam in Polavaram Project Land Acquisition: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డీ-పట్టాల్లో భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు అక్రమార్కులు.. నకిలీ డీ-పట్టాలు సృష్టించి.. పరిహారాన్ని కాజేస్తున్నారు. అసలైన నిర్వాసితులు ఏళ్ల తరబడి తిరుగుతున్నా రాని పరిహారం.. అక్రమార్కులు సృష్టిస్తున్న నకిలీ పట్టాలకు మాత్రం గంటల వ్యవధిలోనే వచ్చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో దళారులు, కొందరు అధికారులు కుమ్మక్కై చేస్తున్న మాయాజాలమిది. కొండ పోరంబోకు భూములకు నకిలీ డీ- పట్టాలు, దొంగ లబ్ధిదారులను సృష్టించి.. కోట్ల రూపాయలలో పరిహారాన్ని దండుకుంటున్న వ్యవహారమిది.
స్థానికంగా ఉన్న కొందరు దళారులకు తోడుగా.. కొందరు రెవెన్యూ సిబ్బంది, ఆర్ అండ్ బీ అధికారుల సహకారంతో వందల ఎకరాల్లో నకిలీ డీ-పట్టాలు జారీ అయిపోతున్నాయి. దానికి పరిహారమూ చెల్లించేస్తున్నారు. గిరిజన లబ్ధిదారుల పేర్లు, వారి పొలాల సర్వే నంబర్లతోనే ఈ నకిలీ పత్రాలను సృష్టించి వారి పేరిట పరిహారాన్ని కూడా కాజేస్తున్న ఉదంతాలు ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో వెలుగుచూస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా దేవీపట్నం మండలంలో ఈ అక్రమాలు తాజాగా బయటపడ్డాయి.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రధాన జలాశయానికి, కుడి కాలువల నిర్మాణానికి భూమిని సేకరిస్తున్నారు. మరోవైపు నిర్వాసిత గ్రామాల పునరావాస ప్రక్రియ సాగుతోంది. ఈ సమయంలోనే దేవీపట్నం మండలంలోని చినరమణయ్యపేట, గుబ్బలంపాలెం గ్రామాల్లో ఈ నకిలీ డీ-పట్టాల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఎకరానికి ఏడున్నర లక్షల చొప్పున ఇప్పటికే ఆ మొత్తాలు నకిలీ లబ్ధిదారులకు అందించడం, ఆ సొమ్ము చేతులు మారడం కూడా పూర్తయిపోయింది.