Police Recruitment: తెలంగాణ రాష్ట్రంలో భర్తీ చేయనున్న 17వేలకు పైగా పోలీస్ అనుబంధ విభాగాల్లోని ఉద్యోగాలకు నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నెల 2న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ 20వ తేదీన ముగుస్తుంది. ఎట్టిపరిస్థితుల్లో గడువు పెంచేది లేదన్న పోలీస్ నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాస్ రావు.. అభ్యర్థులు చివరివరకు వేచిచూడకుండా ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. తుది గడువునకు మరో నాలుగురోజులే ఉండటంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. తొలుత ప్రాథమిక వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. దరఖాస్తు సమయంలో ఇచ్చే చరవాణి నెంబర్, మెయిల్ ఐడీలకే చివరి వరకు సందేశాలు వస్తాయన్న అధికారులు... పదో తరగతి మోమోలోని వివరాలనే ప్రామాణికంగా తీసుకుంటామని స్పష్టం చేశారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసు నియామక మండలి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. గతంలో ఒకరికి బదులు మరోకరు దేహదారుఢ్య పరీక్షలకు హాజరైనట్లు బయటపడింది. చాలామంది పరుగు, లాంగ్‌జంప్‌లో విఫలమవుతుంటారు. అక్కడ అసలు అభ్యర్థి బదులు మరొకరు పరుగెత్తిన ఘటనలు ఉన్నాయి, వాటికి అడ్డుకట్ట వేయడానికి అభ్యర్థుల వేలిముద్రలను సేకరించనున్నారు. అభ్యర్థి ప్రాథమిక అర్హత పరీక్ష నుంచి దేహదారుఢ్యం , తుదిపరీక్షలు రాసేవరకు 9సార్లు అభ్యర్థుల వేలిముద్రలను సేకరించి సరిపోల్చనున్నారు. తద్వారా ప్రాథమిక అర్హత పరీక్ష రాసినవారు కాకుండా ఇతరులెవరైనా వస్తే వెంటనే గుర్తించే అవకాశముందని భావిస్తున్నారు.