రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలు, బయట ఉన్న దర్జీల ద్వారా రోజూ గరిష్ఠంగా 40 లక్షల చొప్పున మాస్కులను తయారు చేయనున్నారు. కరోనా నివారణ కోసం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) అధికారులు కార్యాచరణ రూపొందించారు.
- ప్రతి జిల్లాలో రోజూ 3 లక్షల వరకు తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ పరిధిలో 9 లక్షల సంఘాల్లో దాదాపు కోటి మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరిలో కొంతమందికి మండలాలు, నగరాల్లో నాబార్డు నిధులతో టైలరింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి కుట్టు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. వీరితో మాస్కులు తయారు చేయించనున్నారు.
- బయట ఉన్న టైలరింగ్ దుకాణాల్లో కుట్టులో నైపుణ్యం కలిగినవారితో తయారు చేయిస్తారు.
- వ్యక్తిగత దూరం పాటించేందుకు అనువుగా ఉన్న దుకాణాలను మాత్రమే ఎంపిక చేస్తారు.
- పిల్లలు, పెద్దలు వాడేందుకు వీలుగా ఉండే రెండు పొరల మాస్కులు తయారు చేస్తారు. వీటిని తిరిగి వినియోగించవచ్చు.
- ముదురు నీలం రంగు కాటన్ (100%) వస్త్రాన్ని వినియోగిస్తారు. దీన్ని ఆప్కో నుంచి సేకరిస్తారు.
- ఒక్కో మాస్కు తయారీకి రూ.3 కూలీగా ఇస్తారు.