ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 25, 2022, 10:18 AM IST

ETV Bharat / city

"నన్ను పెళ్లి చేసుకున్నాడు.. ఇప్పుడు మరొకరిని ప్రేమిస్తున్నాడు.. ఏం చేయాలి?"

Relationship Issues : తానొక అబ్బాయిని ప్రేమించింది. కష్టపడి ఇంట్లోవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుంది. వాళ్లకో పాప. ఊరెళ్లినప్పుడు కరోనా లాక్‌డౌన్‌ వచ్చి అక్కడే ఆగిపోయారు. కొన్నాళ్లయ్యాక ఒకరోజు పక్కింటివాళ్లు ఫోన్‌ చేసి "మీ ఆయన మీ ఇంటి ముందున్న అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నారు" అని ఆమెతో చెప్పారు. మొదట్లో నమ్మలేదు. తిరిగొచ్చిన తర్వాత అది నిజమేనని తెలిసింది. చాలా బాధ పడింది. భర్తను, అమ్మాయిని నిలదీస్తే "మేం ఫ్రెండ్లీగా ఉంటాం. ఏవో చిన్నచిన్న అవసరాలకు మాట్లాడుకుంటున్నాం. ఇకనుంచి మానేస్తాం" అన్నారు. తర్వాత మళ్లీ కలుసుకోసాగారు. ఓసారి భర్త ఫోన్‌ చెక్‌ చేసిన ఆమెకు.. చాలామంది అమ్మాయిలతో చాటింగ్‌ చేస్తున్నట్టు కనిపించింది. అప్పట్నుంచి ఆమె మనసు విరిగిపోయింది. భర్త మీద ప్రేమ, నమ్మకం పోయింది. పాప కోసం కలిసి ఉండాల్సి వస్తోంది తప్ప.. వాళ్ల మధ్య ఏ అనుబంధం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదని ఆవేదన చెందుతోంది ఓ సోదరి!

manasulo maata
మనసులో మాట

Relationship Issues :ఆమె విషయంలో జరిగింది బాధాకరమే. సాన్నిహిత్యం, నిబద్ధత, నమ్మకం ఉంటేనే ఆడ, మగ మధ్య ప్రేమ దృఢమవుతుంది అంటాడు ప్రఖ్యాత సైకాలజిస్ట్‌ రాబర్ట్‌ స్టీన్‌బర్గ్‌. అంతకుముందు వాళ్ల అనుబంధంలో ఈ మూడూ ఉండేవి గనకే ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తర్వాత అవి ఎందుకు లోపించాయి? తను వేరే అమ్మాయికి ఎందుకు దగ్గర కావాల్సి వచ్చిందో ఆలోచించాలి? ఇది జరిగాక అయినా తనని అడగాల్సింది.

ఏదేమైనా తను మరొకరితో సన్నిహితంగా ఉండటం సమర్థనీయం కాదు. విషయం తెలిశాక, ఇలాంటివి వద్దు అని చెప్పిన తర్వాత కూడా అతను మళ్లీ అలా చేయడం ముమ్మాటికీ తప్పే. పాప కోసం ఆ నమ్మక ద్రోహం, బాధ భరించడం నిజంగా అభినందనీయం. కానీ ఎన్నాళ్లిలా? ఆమెది చిన్న వయసే. బోలెడంత భవిష్యత్తు ఉంది. దంపతులిద్దరూ ఎడమొహం, పెడమొహంగా ఉంటే అది పాప భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుంది. అతడికి మరో అవకాశం ఇచ్చి చూడాలి. ఇలాంటివి పునరావృతం అయితే బాగుండదని గట్టిగా హెచ్చరించాలి. బహుశా అతడు మారొచ్చు.

ప్రేమించి, పెద్దల్ని ఒప్పించి పెళ్లాడిన అమ్మాయి మనసు నొప్పిస్తున్నాననే విషయం తెలిసి అతడిలో మార్పు రావొచ్చు. ఇప్పటికీ అతను.. పాపని, భార్యను ప్రేమిస్తుంటే తప్పకుండా మారతాడు. గతంలోనూ అమ్మాయిల ఆకర్షణకు లోనైన వ్యక్తి అయితే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అన్నింటికీ ముందు అతడిని కూర్చోబెట్టి అసలు ఆయన మనసులో ఏముంది? ఎందుకు అలా చేశారు? అని ఒపిగ్గా అడగాలి. ఆమెంత బాధ పడుతుందో వివరించాలి. తను సవ్యంగా లేకపోవడం వల్ల కలుగుతున్న పర్యవసానాలు వివరించండి. అవసరమైతే పెద్దలతో చెప్పించాలి. ప్రస్తుతం ఉంటున్న ఇంటిని మార్చి వేరేచోటికి వెళ్తే.. ఆ చేదు జ్ఞాపకాల్లోంచి కొంత బయటపడే అవకాశం ఉంటుంది. ఈ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా ఫలితం సానుకూలంగా ఉంటుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details