కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న పరిస్థితుల్లో... చాలామంది శుభకార్యాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్, మే నెలల్లో వేలాది వివాహాలకు పగ్గాలు పడ్డాయి. పెళ్లి కోసం అప్పులు చేసిన కొందరు... ఉన్నదంతా అమ్ముకొని ఏర్పాట్లు చేసుకున్న మరికొందరు నానా అవస్థలు పడుతున్నారు.
భూమిని అమ్మి...
తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి... తన కుమార్తె వివాహం కోసం ఉన్న భూమిని అమ్ముకున్నారు. మరో 10 రోజుల్లో వేడుక నిర్వహించాల్సి ఉండగా.. లాక్‌డౌన్ వచ్చి పడింది. అనవసరంగా భూమిని తెగనమ్మి నష్టపోవాల్సి వచ్చిందని ఆయన ఆవేదన చెందారు.
అప్పులు చేసి...
వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన ఒక యువకుడు ఏప్రిల్ 9న పెళ్లికి సిద్ధమయ్యాడు. ఖర్చులకు రూ.2లక్షలు అప్పుగా తెచ్చి ఏర్పాట్లు చేసుకున్నాడు. లాక్‌డౌన్‌తో వేడుక వాయిదా పడగా... ఫలితంగా రూ.2లక్షలకు వడ్డీ కడుతున్నామని తెలిపాడు. లాక్‌డౌన్ అనంతరం వివాహం చేసుకోవడానికి మళ్లీ అప్పు చేయాల్సి వస్తుందని వాపోయాడు.
మూడు నెలలు ఎదురుచూపులే..
వివాహ ముహూర్తాలు ఎక్కువగా (వైశాఖ, జ్యేష్ఠ మాసాలు) ఏప్రిల్, మే నెలల్లోనే ఉంటాయి. ఆపై మూఢం వస్తుంది. జూన్ చివర్లో మొదలయ్యే ఆషాఢం జులై వరకు ఉంటుంది. అప్పుడు పెళ్లిళ్లు ఉండవు. ఆగస్టు(శ్రావణం)లో ముహూర్తాలు కొన్నే ఉన్నాయి. ఈ కారణంగా.. ఇప్పుడు వివాహాలు వాయిదా వేసుకున్నవారు మరో మూడు నెలల వరకు వేచిచూడక తప్పదు. పెళ్లిళ్లు ఆగిపోయిన కారణంగా... పురోహితులు, సన్నాయి మేళం, అలంకరణ చేసేవాళ్లు, ఫొటోగ్రాఫర్లు, కేటరింగ్ చేసేవారు సైతం ఇబ్బందులు పడుతున్నారు.
ఇవీ చూడండి:
గూగుల్ డుయోలో 12 మందితో గ్రూప్ వీడియో కాలింగ్!