ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రెండేళ్లు కావొస్తున్నా.. 'పెళ్లి కానుక'కు అందని పిలుపు.. - ysr pellikanuka beneficiaries waiting

వివాహం జరిగి రెండేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం అందిస్తున్న పెళ్లికానుక లబ్ధిదారులకు చేరలేదు. అర్హులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందే సాయం ఆడబిడ్డలకు ప్రయోజనకరంగా ఉంటుందని తల్లిదండ్రులు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల కంటే ముందు జరిగిన పెళ్లిళ్ల లబ్ధికి రూ. కోట్లు పెండింగ్​లో ఉన్నాయి. ఖాతాలో రుపాయి వేసి మిగిలిన లబ్ధిని అందించకపోవడంతో సాయం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు.

marriage couple did not get pelli kanuka
marriage couple did not get pelli kanuka

By

Published : Jul 4, 2021, 12:37 PM IST

రెండేళ్లు దాటినా ఇంకా పెళ్లి కానుకకు పిలుపు అందలేదు. ఈ ఏడాదిలో ఏప్రిల్‌ నుంచి కానుక ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఆ ఊసే లేదు. కొవిడ్‌ మొదటి.. రెండో దశలో మధ్య తరగతి, నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాయి. ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం నుంచి అందే సాయం ప్రయోజనకరంగా ఉంటుందని భావించి వారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా సరైన సమాధానం ఇచ్చేవారే కరవయ్యారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన పెళ్లిళ్ల లబ్ధికి రూ.కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని కూడా మంజూరు చేయలేదు.

వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాం..

ఖాతాలో రుపాయివేసి మిగిలిన లబ్ధిని అందించలేకపోవడంతో సాయం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు. కొవిడ్‌ మొదటిదశలో 2020 మార్చి 22వ తేది నుంచి పెళ్ళికానుకకు వివాహాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది. అదిగో.. ఇదిగో ఆరంభం కాబోతుందనే సమాచారంతో సచివాలయాలు, మీ-సేవా కేంద్రాలు, మండల సమాఖ్య కార్యాలయాల చుట్టూ పత్రాలతో సామాన్యులు కాళ్లారిగిలే తిరుగుతున్నారు. వివాహానికి ఐదు రోజుల ముందు పత్రాలు సమర్పిస్తే సాయం అందిస్తారనే నిబంధన ఉంది. పత్రాలన్నీ సమకూర్చుకునేందుకు ఒక్కొక్కరికీ సుమారు రూ.600 పైబడి ఖర్చవుతుంది. పెళ్లి ఆహ్వాన పత్రికలు, వివిధ ధ్రువపత్రాలతో సాయం అందించాలంటూ పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని పెద్దలు అధికారుల్ని కలుస్తున్నారు.

లబ్ధిని పెంచి.. మార్గదర్శకాలు మరిచి..

గడచిన ఏడాది ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి గతంలో అమలైన పెళ్లి కానుక లబ్ధిని ప్రభుత్వం పెంచింది. పెంపుదల సాయం ఇప్పటివరకు ఒక్కరికీ అందించలేదు. దరఖాస్తుకు అవకాశమే లేకపోవడంతో గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకు పెళ్లిళ్లు చేసుకున్నవారు తమకు తర్వాతైన సాయం అందిస్తారా లేదా అని ఆందోళన చెందుతున్నారు. పెళ్లికానుకకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. ఎవరికి దరఖాస్తులు ఇవ్వాలి.. పరిశీలన.. లబ్ధి ఎలా అందజేస్తారనే మార్గదర్శకాలు ఇప్పటివరకు రాలేదు. మరోవైపు 2019 మార్చి నుంచి పెళ్లి కానుకల ప్రోత్సాహక నగదు మంజూరవ్వలేదు. కానుకకు అర్హత సాధించి ఆన్‌లైన్‌ పూర్తయినవారు జిల్లాలో 4,106 మంది ఉన్నారు. వీరికి రూ.17.60 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నాయి. సాయం కోసం అర్హులు కార్యాలయాల వెంట తిరుగుతున్నారు. కరోనా రెండోదశలో కర్ఫ్యూ మినహాయింపులతో గత కొన్ని రోజులుగా వివాహాలు పెరిగాయి. పెళ్లికానుక లబ్ధితో ఆడబ్డిడల వివాహ కష్టాల నుంచి గట్టెక్కాలని అల్పాదాయ కుటుంబాలు భావిస్తుంటే ఆ ఆశ తీరని పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంది. పెండింగ్‌ బకాయిలు మంజూరు చేయడంతోపాటు కొత్తగా అర్హులైన వారందరికి లబ్ధి అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఇదీ చదవండి:RAILWAY BOARD:వెబ్‌సైట్​లో 'దక్షిణ కోస్తా' జోన్.. శుభ సంకేతమంటున్న రైల్వే వర్గాలు

ABOUT THE AUTHOR

...view details