Margadarsi MD : మార్గదర్శి చిట్‌ఫండ్ విజయానికి రికవరీనే ప్రధాన కారణమని సంస్థ ఎండీ శైలజా కిరణ్ తెలిపారు. 99 శాతం రికవరీ రేట్‌తో మార్గదర్శి సంస్థ మెరుగైన ఫలితాలు సాధిస్తోందని తెలిపారు. సంస్థ ఏర్పాటై 60 ఏళ్లు పూర్తైన సందర్భంగా తమ భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. కొవిడ్ కారణంగా సాధించలేకపోయిన రూ.12 వేల కోట్ల టర్నోవర్‌ను ఈ ఏడాది సాధిస్తామని ఆమె తెలిపారు.
3 రోజుల్లోనే సెటిల్మెంట్: ప్రస్తుతం సంస్థ 4 రాష్ట్రాల్లో 108 శాఖలు, 4300 మంది ఉద్యోగులతో రూ.10 వేల టర్నోవర్ సాధించిందని శైలజా కిరణ్ వివరించారు. మధ్య తరగతి కలలకు చిట్స్ ఎంతో ప్రత్యేకమైనదని.. తమ సంస్థలో సామాన్యులు మొదలుకొని అన్ని రంగాల్లో ప్రముఖులు కస్టమర్లుగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం రూ.9,700 కోట్ల టర్నోవర్ సాధించామని.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12 వేల కోట్ల టర్నోవర్ సాధిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు 60 లక్షల మందికి పైగా మార్గదర్శి సేవలు అందించిందని.. అత్యవసర పరిస్థితుల్లో చిట్ నుంచి డబ్బు విత్ డ్రా చేసుకునే వారికి 3 రోజుల్లోపే సెటిల్ చేస్తున్నామని శైలజా కిరణ్ తెలిపారు.