దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సీపీఐ మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం ప్రకటించింది. మల్కన్‌గిరి కోరాపుట్ - విశాఖ డివిజన్ (ఎంకేవీ) కమిటీ కార్యదర్శి కైలాసం ఈ మేరకు ఓ ఆడియో టేపును విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా కరోనాతో అధిక సంఖ్యలో మరణాలు సంభివిస్తున్నాయని.. వేలాది మంది వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అన్నారు. వైరస్‌ను నిరోధించడానికి పాలకవర్గాలు చేస్తున్న ప్రయత్నానికి ఆటంకం కలిగించకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రధానంగా ఈ విపత్కర సమయంలో మావోయిస్టు పార్టీ నుంచి గానీ పిఎల్జిఏ, అనుబంధ సంస్థల నుంచి పోలీసులపై ఎటువంటి దాడులకు పూనుకోమని ఆయన స్పష్టం చేశారు.
పోలీసుల నుంచి తమ నిర్ణయానికి భిన్నంగా కార్యచరణ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతిఘటించక తప్పదని కైలాసం స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వ వైఖరిని ఐదు రోజుల్లో తెలియపరచాలని కోరారు. ప్రస్తుతం ఆంధ్రా - ఒడిశాలో ప్రజలకు ఇస్తున్న నిత్యావసర సరుకులు ఏ మాత్రం సరిపోవటం లేదని...మరిన్ని సరుకులు అందజేయాలని డిమాండ్ చేశారు.