మావోయిస్టు పార్టీ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, ఎంకేవీబీ డివిజన్ కార్యదర్శి ముత్తన్నగారి జలంధర్‌రెడ్డి అలియాస్ మారన్న అలియాస్ కృష్ణ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎదుట మంగళవారం లొంగిపోయారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా భూంపల్లికి చెందిన ఆయన 2000లో తొలుత మావోయిస్టు పార్టీ గిరిపల్లి దళంలో చేరారు. మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన్ను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన డీజీపీ.. జలంధర్‌రెడ్డి పాల్పడిన నేరాల వివరాలు వెల్లడించారు.
7 హత్య కేసులు.. 19 ఎదురుకాల్పుల ఘటనలు
*2008లో బలిమెలలో భద్రత దళాలపై జరిగిన దాడి ఘటనలో రెండో అసాల్ట్ బృందానికి నాయకత్వం
*2011లో ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ వినీలకృష్ణ అపహరణలో ప్రధాన పాత్ర
*2001లో కర్నూలు జిల్లా శ్రీశైలం, సున్నిపెంట, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసుస్టేషన్‌లపై దాడి
*ఏవోబీ పరిధిలో ఏడు హత్య కేసుల్లో నిందితుడు. 19 ఎదురుకాల్పుల ఘటనల్లో పాల్గొన్నారు.
ఆర్‌కే పరిరక్షణ బృందానికి కార్యదర్శి
*జలంధర్‌రెడ్డి ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో మావోయిస్టు సిద్ధాంతం పట్ల ఆకర్షితులై 1998లో రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో సభ్యుడిగా చేశారు. 2002లో అజ్ఞాతంలోకి వెళ్లి గిరిపల్లి దళంలో చేరారు.
*మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్‌కే పరిరక్షణ బృందానికి కార్యదర్శిగా 2013 నుంచి 2016 వరకూ వ్యవహరించారు.
*2019 జనవరి నుంచి ఎంకేవీబీ డివిజినల్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2019 అక్టోబరులో ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది.. ఆ స్థానంలో కొనసాగుతున్నారు.
రెండేళ్లలో సగం మంది తగ్గిపోయారు
జలంధర్‌రెడ్డిపై రూ.20 లక్షల నగదు రివార్డు ఉందని.. ఆ నగదుతో పాటు ఇంటిస్థలం, అవసరమైతే వ్యవసాయ భూమి ఇస్తామని, స్వయం ఉపాధి కల్పిస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇంకా ఏమన్నారంటే.. ‘ఏవోబీలో రెండేళ్ల కిందట వరకూ 160-180 మంది మావోయిస్టులు ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య 70-80కే పరిమితమైంది. ఈ ప్రాంతంలో గతంలో ఎనిమిది ఏరియా కమిటీలు ఉండగా ఇప్పుడు నాలుగే మిగిలాయి. గత రెండేళ్లలో 32 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీకి ప్రజల్లో మద్దతు కొరవడింది. కొత్తగా ఎవరూ చేరడంలేదు. వారిపై వ్యతిరేకత పెరిగింది. ఏపీ పోలీసులు చేపడుతున్న చైతన్య కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు ఆకర్షితులవుతుండటంతో మావోయిస్టులు ఉనికి కోల్పోతున్నారు. ఆ పార్టీకి భవిష్యత్తు కనిపించకపోవటంతో జలంధర్‌రెడ్డి జనజీవన స్రవంతిలో కలిశారు.’
అనారోగ్య సమస్యలు..