ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MGM Hospital: దండిగా ఎలుకలు.. రోగుల్లో గుబులు..! - warangal mgm hospital latest news

MGM Hospital: పేరున్న పెద్దాసుపత్రి...! ఎంతోమంది వైద్యులు...సరిపడా నర్సులు..! అయినా రోగులకు ఇంకా గుబులు...! ఎందుకంటే....ఆస్పత్రి నిండా దండిగా ఎలుకలు...దీంతో వంతుల వారీగా నిద్రలు..! ఇవీ తెలంగాణలోని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో రోగులు, వారి సహాయకుల దీనావస్థలు. రోగి శ్రీనివాస్‌ చేతి, కాలి వేళ్లు ఎలుకలు కొరికిన ఘటన మిగిలిన రోగుల్లో భయం పెంచుతోంది. ఘటనను సీరియస్​గా తీసుకున్న ప్రభుత్వం సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు వేసింది.

warangal mgm hospital
దండిగా ఎలుకలు.. రోగుల్లో గుబులు

By

Published : Apr 1, 2022, 11:07 AM IST

దండిగా ఎలుకలు.. రోగుల్లో గుబులు

MGM Hospital: తెలంగాణలోని వరంగల్ జిల్లా ఎంజీఎం ఆస్పత్రిలో అపస్మారకస్థితిలో ఉన్న రోగి శ్రీనివాస్‌పై ఎలుకల దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు.. వెంటనే జిల్లా అదనపు కలెక్టర్‌తో విచారణకు ఆదేశించారు. ఎలుకల దాడి వాస్తవమన్న నివేదికతో విచారణకు ఆదేశించిన 6 గంటల్లోనే చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఎంజీఎం సూపరింటెండెంట్‌గా ఉన్న శ్రీనివాసరావును బదిలీ చేశారు. ఆయన స్ధానంలో వి. చంద్రశేఖర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యులపైనా సస్పెన్షన్ వేటు వేసింది. కరోనా సమయంలో సమర్థవంతంగా సేవలందించిన ఆస్పత్రి జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ చంద్రశేఖర్‌కే మళ్లీ పదవిని కట్టబెట్టింది. కొత్త సూపరింటెండెంట్ నేడు బాధ్యతలు చేపట్టనున్నారు.

నిద్రలేని రాత్రులు..:ప్రాణాలు నిలబెట్టుకుందామని పెద్దాసుపత్రికి వస్తే రోగాల మాట దేవుడెరుగు.. ఎలుకల దాడి ఘటనతో రోగుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఎవరిని తట్టినా ఎలుకల పురాణమే చెబుతున్నారు. ఐసీయూ సహా ఇతర వార్డుల్లోనూ ఎలకలు యథేచ్చగా తిరుగుతున్నాయని తెలిపారు. రోగికి సంబంధించి ఇద్దరు కుటుంబ సభ్యులుంటే ఒకరు పడుకుంటే మరొకరు కాపాలా కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని... త్వరలోని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని నర్సులు తెలిపారు. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారని పేర్కొన్నారు.

గతంలోనూ వివాదాలు..:1300 పడకలు, 24 వైద్య విభాగాలు కల్గిన ఎంజీఎంకు ఉమ్మడి వరంగల్‌ సహా ఇతర జిల్లాల నుంచి చికిత్స నిమిత్తం రోగులు వస్తుంటారు. వైద్యసేవలు సత్ఫలితాలిస్తున్నా...కొందరి నిర్లక్ష్యం కారణంగా ఆస్పత్రి తరచూ అప్రతిష్ట పాలవుతోంది. 2017లో మార్చూరీలో మృతదేహాలను ఎలుకలు పీక్కు తినడం కలకలం రేపింది. ఇదే మాదిరి 2018లో మృత శిశువును కొరుక్కుతిన్నాయి. అప్పటినుంచి ఎలుకల బెడద వేధిస్తోంది. ఆస్పత్రి ప్రాంగణంలో చెత్తా చెదారంతో పాటు మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఎలుకలు వస్తున్నాయని బాధితులు చెబుతున్నారు.

ఇవీచూడండి:

ABOUT THE AUTHOR

...view details