GROUP-1: గ్రూపు-1 (2018 నోటిఫికేషన్) ప్రధాన పరీక్షల జవాబు పత్రాలను మాన్యువల్ (చేతితో దిద్దే) విధానంలో రెండు సార్లు మూల్యాంకనం చేశారని గ్రూపు-1 అభ్యర్థుల్లో పలువురు హైకోర్టులో వేేసిన రీజాయిండర్ కౌంటర్లో ఆరోపించారు. ఒకసారి మాత్రమే మూల్యాంకనం చేసినట్లు ఏపీపీఎస్సీ హైకోర్టుకు చెప్పిందని, జవాబుపత్రాలను చేతితో దిద్దాలని కోర్టు ఆదేశించిన తర్వాత కమిషన్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ‘ఇద్దరు ఛైర్మన్లు, ముగ్గురు కార్యదర్శులు మారారు. పెన్నూ-పేపరు విధానంలో మూల్యాంకనం చేసి, 2022 ఫిబ్రవరి 25న ఫలితాల విడుదలకు కమిషన్ సిద్ధమైనా ఏవో కారణాలతో విరమించుకుంది. అనంతరం కమిషన్ సభ్యుల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో 2022 మార్చి 25 నుంచి మే వరకు మరోమారు మూల్యాంకనం జరిగింది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం మౌఖిక పరీక్షలకు ఎంపిక చేసిన 325 మంది అభ్యర్థుల జాబితాను కమిషన్ ప్రకటించింది. దీనివల్ల డిజిటల్, మాన్యువల్ వాల్యుయేషన్ ద్వారా మౌఖిక పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలో భారీ వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి’ అని పేర్కొన్నారు.
హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం.. రూ.2.5 కోట్ల ఖర్చు
‘2021 డిసెంబరులో ఓసారి మాన్యువల్ విధానంలో జవాబు పత్రాలను దిద్దారు. అందుకు రూ.2.5 కోట్లు ఖర్చు చేసినా ఫలితాలను వెల్లడించలేదు. తొలివిడత మాన్యువల్ విధానంలో హాయ్‌లాండ్ రిసార్ట్స్‌లో జవాబుపత్రాలను మూల్యాంకనం చేశారు. డిసెంబరు 6న మూల్యాంకన విధుల్లో పాల్గొన్న వారికి క్యామ్‌సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఆహార సదుపాయాలను సమకూర్చింది. హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థకు డైరెక్టర్లుగా మధుసూదన్ పమిడికాల్వ, శోభాశ్రీ కూచి డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థకు డిసెంబరు 10లోగా రెండు విడతలుగా మొత్తం రూ.10 లక్షలు చెల్లించారు. డిసెంబరు 21 నుంచి మూల్యాంకనం ప్రారంభమైంది. కమిటీలో ఉన్న అధికారులు ఉదయం ఏపీపీఎస్సీ కార్యాలయానికి వెళ్లి వేలిముద్రలు వేసి, హాయ్‌లాండ్ రిసార్ట్స్‌లో మూల్యాంకన విధులకు హాజరయ్యారు. వీరి కాల్‌డేటా రికార్డులను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయి. మూల్యాంకన ప్రక్రియ, ఇతర లాజిస్టిక్స్ సపోర్టు కోసం హైదరాబాద్ సంస్థకు ఫిబ్రవరి 21న మరో రూ.1,14,32,312 చెల్లించారు. మార్కుల జాబితాలను స్కాన్ చేసే బాధ్యతను దిల్లీకి చెందిన డేటాటెక్ మెథడిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. ఇదే సమయంలో ఫిబ్రవరి 24న గౌతం సవాంగ్ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
తమవారి పేర్లు చేర్పించాలని సభ్యుల పట్టు
ఫలితాల జాబితాపై కార్యదర్శి, కమిటీలోని కాన్ఫిడెన్షియల్ విభాగ అధికారులు సంతకాలు చేశారు. కమిషన్ సభ్యుల వద్దకు సంతకాల కోసం వెళ్లినప్పుడు పలువురు తాము సూచించిన అభ్యర్థుల పేర్లను జాబితాలో చేర్చాలని కోరినా కార్యదర్శి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో కొత్త ఛైర్మన్, సభ్యులు ఫలితాల వెల్లడిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కార్యదర్శి ఫలితాల జాబితా విసిరేసి కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. మర్నాడు జవాబుపత్రాలు హాయ్‌లాండ్ రిసార్ట్సు నుంచి ఏపీపీఎస్సీ కార్యాలయానికి వచ్చాయి. ఫిబ్రవరి 27న కార్యదర్శిగా అహ్మద్ బాబు నియమితులై బాధ్యతలు స్వీకరించాక తొలి విడత మూల్యాంకన ఫలితాల విషయాన్ని పక్కనబెట్టారు. మార్చి 25న రెండోసారి మూల్యాంకనం ప్రారంభమైంది. పలు జవాబు పత్రాలపై ఒకే చేతిరాత రాకుండా వేర్వేరువి ఉన్నాయి.