ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మీకేం కాదు.. మేమున్నాం' అనే ధైర్యంతోనే కోలుకున్నారు! - ధైర్యంతో కోలుకుంటున్న కరోనా బాధితులు

కరోనా వచ్చినంత మాత్రాన కానివారు కాదనీ... మరికొద్దిరోజుల్లో మళ్లీ మనతో కలసి నడిచే వారేననే స్పృహతో... కరోనా వేళ మనసున్న మనుషులు చూపుతున్న మమతలు చూద్దాం రండి!!

many-people-helping
many-people-helping

By

Published : Aug 3, 2020, 9:23 AM IST

అప్పటిదాకా మన వెంట ఉన్నవాళ్లే...మనతో ముచ్చట్లాడినవాళ్లే... పాజిటివ్‌ అనగానే - గప్‌చుప్‌! మాట్లాడటానికి కూడా భయం. ‘వచ్చిందట... వాళ్లకు వచ్చిందట...’ అంటూ గుసగుసలు! బంధాలు బంధుత్వాలు పక్కనబెట్టి... తన వాళ్లనుకున్న వాళ్లనే వెలి వేసి... దూరంగా పెట్టడం...

నాణేనికి ఇదో కోణమైతే... అవునా మీకు పాజిటివ్‌ వచ్చిందా.. ఫర్వాలేదు భయపడకండి... 14 రోజులేగా!’’ అని ధైర్యం చెప్పే బంధువులు... మీరు మీ గదిలో హాయిగా ఉండి సమయానికి మందులు తీసుకోండి... మేం అన్నీ చూసుకుంటాం’’ అంటూ భరోసా ఇచ్చే ఇంటి యజమానులూ.... మీరు ఆస్పత్రిలో ధైర్యంగా చికిత్స తీసుకోండి. ఇంట్లో వాళ్లంతా బాగానే ఉన్నారు. వాళ్లను చూసుకునే బాధ్యత మాది. త్వరగా కోలుకొని రండి’’ అంటూ వెంట నిలిచే ఇరుగు పొరుగూ... ఉన్నారు.

  • 'రత్నా'ల్లాంటి స్నేహితులు...

రత్నాకర్‌ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. కార్యాలయంలో నలుగురితో పాటు పాజిటివ్‌ వచ్చింది. ఊపిరి కాస్త ఇబ్బందిగా అన్పించి డాక్టర్‌కు ఫోన్‌ చేస్తే వెంటనే ఆస్పత్రిలో చేరమన్నారు. ఆలస్యం చేయకుండా ఫోన్లో స్నేహితులకు విషయం చెప్పి ఆస్పత్రికి వెళ్లాడు. జేబులో ఉన్న క్రెడిట్‌ కార్డుతో అడ్మిషన్‌కు సరిపడా డబ్బులు కట్టాడు. ఆ తర్వాత తన పరిస్థితి ఇబ్బందికరంగా మారటంతో ఐసీయూ నుంచి క్రిటికల్‌ కేర్‌కు మార్చారు. దాదాపు వారం రోజుల దాకా 30% మాత్రమే కోలుకునే అవకాశాలున్నాయన్నారు డాక్టర్లు. కానీ పదకొండో రోజు ఇంటికి వచ్చేశాడు రత్నాకర్‌. మృత్యుముఖంలోకి వెళ్లిన రత్నాకర్‌కు వెన్నంటి నిల్చింది ఆయన మిత్రబృందం. 30 సంవత్సరాల కిందట ఇంటర్మీడియట్‌ నాటి స్నేహితులంతా కలసి డబ్బులు పోగు చేసుకొని 20 లక్షల దాకా జమచేశారు. తను ఆస్పత్రిలో చేరగానే ఆస్పత్రివాళ్లకు చెప్పేశారు. ఇకమీదట రత్నాకర్‌ ఫీజు గురించి ఎవర్నీ అడగొద్దని, మా బాధ్యతని చెప్పారు. అంతేగాకుండా రత్నాకర్‌కు రోజూ ఫోన్‌ ద్వారా ధైర్యం నూరిపోశారు. బతుకుపై ఆశ పెంచారు. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చేప్పుడు కూడా బిల్లంతా తామే కట్టేసి... ఇంటికి తీసుకొచ్చారు. విశేషం ఏంటంటే.. ఈ మిత్రబృందంలో ఓ టీ కొట్టు యజమానీ ఉన్నాడు. రోజూ టీ కొట్టుపై వచ్చే డబ్బుతో జీవించే ఆ మిత్రుడు... మరో ఆలోచన లేకుండా తాను దాచుకున్న 28,800 రూపాయలను తక్షణం రత్నాకర్‌ అకౌంట్‌కు బదిలీ చేశాడు. 'ఇలాంటి మిత్రులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను' అంటాడు రత్నాకర్‌.

  • ఇల్లప్పగించిన యజమాని...

ప్రవీణ్‌ హైదరాబాద్‌ చంపాపేటలోని ఓ అద్దె ఇంట్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నాడు. తమ కార్యాలయంలో కరోనా పరీక్షలు చేయడంతో తానూ చేయించుకున్నాడు. పాజిటివ్‌ అంటూ మరుసటి రోజు ఫోన్‌ వచ్చింది. మీరే వస్తారా... లేక అంబులెన్స్‌ పంపమంటారా అంటూ జీహెచ్‌ఎంసీ వాళ్ల నుంచి ఫోన్‌. అంబులెన్స్‌ వస్తే కాలనీలో పెద్ద చర్చ అవుతుందనుకొని నేనే వస్తానని చెప్పేశాడు ప్రవీణ్‌. భార్యను విడిచి వెళ్లటం ఎలా అని ఒకవంక... అద్దె ఇల్లు కాబట్టి యజమాని ఏమంటారోనని మరోవంక బెంగ! మొత్తానికి భయపడుతూనే యజమాని ప్రతాప్‌రెడ్డికి విషయం చెప్పేశారు.

'ఇందులో భయపడేదేముంది ప్రవీణ్‌. ఇవాళ నీకొచ్చింది... రేపు నాకొస్తుందేమో. అప్పుడూ పరిస్థితి ఇలాగే ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఆస్పత్రికి వెళ్లు. మీ ఆవిడను ఇంట్లోనే ఉండమను. తనకు పరీక్ష జరగకుండా అటూ ఇటూ తిప్పటం సరికాదు. ఆమె ఎటూ వెళ్లాల్సిన అవసరం లేదు. మాకు ఇంకో ఇల్లుంది. మేమే వెళతాం. నీకు లక్షణాలు లేవు కాబట్టి ... ఆస్పత్రిలో ఎందుకు? కావాలంటే ఇంటికి వచ్చి ఇక్కడి నుంచే చికిత్స తీసుకో' అంటూ యజమాని ప్రతాప్‌రెడ్డి స్పందించటంతో ప్రవీణ్‌కు కరోనాను అప్పుడే జయించినంత ధైర్యం వచ్చేసింది.

  • వాళ్ళు వద్దన్నా...

చదువుకున్న వాళ్లయినా, ఏమీ కాదని తెలిసినా.. ఏదో తెలియని భయం. పాజిటివ్‌ వచ్చిందనగానే వారిని వెలివేసినంత పని. హయత్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంటులో జంటకు పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆ అపార్ట్‌మెంట్‌ వాసులంతా ఆందోళనతో వారిని వెంటనే ఖాళీ చేసి ఆస్పత్రికి వెళ్లమని ఒత్తిడి తెచ్చారు. తమకు అంతగా లక్షణాలు లేవనీ... ఆస్పత్రికి అవసరం లేదని డాక్టర్లే చెబుతున్నారని చెప్పినా వినిపించుకోలేదు. పెద్దగోలే జరిగింది. పక్కనున్న అపార్ట్‌మెంట్ల వాళ్లు వచ్చి- చెబితే ఎలాగోలా అయిష్టంగానే అంగీకరించారు. కానీ ఇంట్లోంచి అస్సలు బయటకు రావొద్దని హెచ్చరించారు. ఒకట్రెండు రోజులు ఆ ఇద్దరూ తమ ఇంట్లో ఉన్నవి వండుకొని తిన్నారు. తర్వాత సాయం అడిగితే ఎవ్వరూ అటు దిక్కుకు కూడా చూడటం లేదు. విషయం తెలుసుకున్న పక్క అపార్ట్‌మెంట్‌ మిత్రులు రోజూ తాము వండుకున్న వంటలే రెండు పూటలా వీరికీ తెచ్చి... గుమ్మం ముందు పెట్టి వెళ్లేవారు. ఇతరత్రా పండ్లు, కషాయాలకు కావల్సిన సామగ్రి కూడా తెచ్చి ఇచ్చారు.

  • 'రాజా' భరోసా!

రాజారావు ఓ ప్రైవేటు ఉద్యోగి. ఈ మధ్యే వనస్థలిపురంలో ప్లాట్‌ కొనుక్కొని గృహప్రవేశం చేశారు. ఇంతలో కరోనా బారిన పడ్డారు. అంతకుముందు వారమే పక్క వీధిలో కరోనా కేసు వచ్చిందని... వీళ్ల కుటుంబాలన్నింటికీ జాగ్రత్తలు చెప్పి, ఎంతో కట్టడి చేసుకుంటున్నారు అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌. ఇప్పుడు తన సంగతి తెలిస్తే... ఎలా స్పందిస్తారోనని... గదిలో భయంగా బిగించుకొని ఒంటరిగా ఉండసాగారు రాజారావు. కానీ ఇంతలో ఎలాగోలా అపార్ట్‌మెంట్‌లో తెలియనే తెలిసింది. తెలియని అలజడి. కింద అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ సమావేశం. కాసేపటికి- అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మీటింగ్‌ నుంచే ఫోన్‌ చేశారు. ఏమంటారోననుకుంటూ భయంభయంగా రూమ్‌లోంచి ఫోన్‌ ఎత్తారు రాజారావు. '‘రాజారావుగారూ ఎలా ఉన్నారు. మీకెలా ఉంది? ఏం భయపడకండి. త్వరగానే కోలుకుంటారు. హాయిగా గదిలో ఉండండి. బయటకు రాకండి. మీకు ఏం కావాలన్నా మేం తెచ్చిస్తాం. రోజూ పాలూ, కూరగాయలు, ఏదైనా సామాన్లు అవసరమైతే మేమే తెచ్చిస్తాం. పిల్లల గురించి భయపడకండి. ఇంకా ఏదైనా అవసరమైతే ఏ క్షణమైనా మీరు ఫోన్‌ చేయొచ్చు. మీ వెంట మేమున్నాం. భయపడకండి' అంటూ లక్షణాలు వాటి గురించి అడిగి పెట్టేస్తుంటే... రాజారావు మనసు కరోనాపై తొలి గెలుపు పంచ్‌ విసిరింది!

  • ఆస్పత్రులతో ఒప్పందం...

కేపీహెచ్‌బీలోని రెయిన్‌ట్రీ పార్క్‌ (మలేసియా టౌన్‌షిప్‌)... దాదాపు 1800 ఫ్లాట్‌లు! 37 బ్లాక్‌లు... ఓ ఊరితో సమానం అది. అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ ముందు నుంచే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... బయటికెళ్లి పనిచేసి వస్తున్న వాళ్ల ద్వారా.. కరోనా రానే వచ్చింది. దగ్గరదగ్గరుండే ఆ అపార్ట్‌మెంట్లలో కలకలం. అసోసియేషన్‌ సభ్యులు ధైర్యం చెప్పారు. క్వారంటైన్‌లో ఉన్నవారందరికీ తామే సామగ్రి సరఫరా చేయటం... వారి బాగోగులు, అవసరాలు చూడటం మొదలెట్టారు. 'మేం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా 5 బ్లాకుల్లో 16 మందికి వచ్చింది. ఎవరికీ పెద్దగా ఇబ్బందేమీ లేదు. కోలుకుంటున్నారు. క్వారంటైన్‌లో ఉంటున్నవారందరికీ ప్రత్యేక సిబ్బందితో సేవలందిస్తున్నాం. ఓ ఆరోగ్య కేంద్రం కూడా పెట్టుకున్నాం. ఆస్పత్రులతో ఒప్పందం చేసుకున్నాం. వారానికో రెండురోజులు డాక్టర్లు వచ్చి మిగిలినవారికి అవసరమైన ఇతర ఆరోగ్య సమస్యలు చూస్తున్నారు. మార్కెట్‌ నుంచి కాకుండా... నేరుగా రైతుల నుంచి కూరగాయలు, పండ్లు తెప్పిస్తున్నాం. దీంతో రైతులకూ సాయం చేసినట్లవుతుంది... మాకూ తక్కువ ధరకు వస్తున్నాయి’ అని అసోసియేషన్‌ బాధ్యులు నెల్లూరు శ్రీనివాసులు తెలిపారు.

ఇదీ చదవండి:హఠాత్తుగా ఆపద.. కొవిడ్ రోగుల హఠాన్మరణం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details