ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TEJAS: ‘తేజస్‌’ యుద్ధ విమానం మధ్యభాగం తయారీ ఇక్కడే - Tejas jet

తేజస్ యుద్ధ విమానం తయారీలో ముఖ్యమైన మధ్యభాగాన్ని హైదరాబాద్‌లోని వెమ్‌ టెక్నాలజీస్‌ సంస్థ విజయవంతంగా రూపొందించింది. విమానంలో అత్యంత కీలకమైన మధ్య భాగాన్ని తయారు చేయడం ఏరోస్పేస్ రంగంలో కీలక మైలురాయిగా మారనుంది. ఈ విమానాన్ని ఈ నెల 26న హెచ్‌ఏఎల్‌కు అందజేయనున్నారు.

tejas
తేజస్‌ యుద్ధ విమానం

By

Published : Jul 23, 2021, 11:48 AM IST

రక్షణ రంగ పరిశోధనలు, ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో మరో ముందడుగు పడింది. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో భారత్‌ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ తయారీలో ముఖ్యమైన మధ్యభాగం (సెంటర్‌ ఫ్యూజ్‌లేజ్‌)ను హైదరాబాద్‌లోని వెమ్‌ టెక్నాలజీస్‌ సంస్థ విజయవంతంగా రూపొందించింది. యుద్ధవిమానానికి వెన్నెముక లాంటి మధ్యభాగాన్ని ఇక్కడ తయారు చేయడం ఏరోస్పేస్‌ రంగంలో కీలకమైన మైలురాయిగా రక్షణ పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. విమానంలో మధ్యభాగం అత్యంత కీలకం.

దీని కింద ల్యాండింగ్‌ గేర్లు, క్షిపణులను మోసుకెళ్లే ఆయుధ వ్యవస్థ, ఇంధన ట్యాంకు ఉంటాయి. సుమారు 650 కిలోల బరువు ఉంటుంది. వెమ్‌ టెక్నాలజీస్‌ వేర్వేరు సంస్థలతో పోటీ పడి దీని తయారీకి అవకాశం పొందింది. ఆకాశ్‌ క్షిపణికి సెక్షన్‌-3, సుఖోయ్‌ యుద్ధ విమానం రాడార్లకు అవసరమైన వ్యవస్థలు, ఐఆర్‌ సీకర్స్‌, సర్వేలెన్స్‌ తయారు చేసిన అనుభవం ఈ సంస్థకు ఉంది. నాణ్యత పరీక్షలు పూర్తవడంతో సెంటర్‌ ఫ్యూజ్‌లేజ్‌ను ఈ నెల 26న హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)కు అందజేయనున్నారు.

అయిదేళ్లు పట్టింది...

తేజస్‌ మధ్య భాగం తయారీకి దాదాపు 1595 విడిభాగాలను కూర్చాల్సి ఉంటుంది. తొమ్మిది విభాగాలుగా చేసుకుని ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన అసెంబ్లీ జిగ్‌పై మధ్యభాగాన్ని రూపొందించారు. ఇందులో ఉపయోగించే ఏ పరికరమైనా ఉత్పత్తి దశలో విఫలమైతే కొత్తవి బిగించాల్సి వచ్చేది. హెచ్‌ఏఎల్‌లో శిక్షణ పొందిన 30 మంది ఇంజినీర్లు, మరో 20 మంది సాంకేతిక సిబ్బంది దాదాపు అయిదేళ్లు శ్రమించి మధ్యభాగాన్ని రూపొందించారు. ఈ అనుభవంతో ఏడాదికి రెండు నుంచి నాలుగు మధ్య భాగాలను ఇక్కడ తయారు చేయవచ్చంటున్నారు ఇంజినీర్లు. ‘దేశంలోని సాయుధ దళాలకు ఎన్నో క్లిష్టమైన వ్యవస్థలను మా సంస్థ ఎంతోకాలంగా సరఫరా చేస్తోంది. భారత్‌కు తలమానికమైన తేజస్‌ యుద్ధ విమానానికి ముఖ్యమైన భాగాన్ని అందించడానికి హెచ్‌ఏఎల్‌తో భాగస్వాములమయ్యాం. మా సంస్థ మొదటి సెంటర్‌ ఫ్యూజ్‌లేజ్‌ను విజయవంతంగా రూపొందించింది’ అని వెమ్‌ టెక్నాలజీస్‌ సీఎండీ వి.వెంకటరాజు తెలిపారు.

ఇదీ చూడండి:OLYMPIC MEDAL WINNERS: ఒలింపిక్స్‌లో.. చెరగని సంతకాలు!

ABOUT THE AUTHOR

...view details