న్యాయస్థానాల్లో దాఖలైన వ్యాజ్యాల విషయంలో అధికారులు అత్యంత జాగ్రత్తగా మెలగాలని హైకోర్టు హితవు పలికింది. అసాధారణ జాప్యంతో రెండో అప్పీల్ దాఖలు చేసిన మంగళగిరి తహసీల్దార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.25 వేలు జరిమానా విధిస్తూ ఆ సొమ్మును నాలుగు వారాల్లో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని తేల్చిచెప్పింది. రెండో అప్పీలు దాఖలుకు జాప్యానికి కారణమైన బాధ్యులైన అధికారుల నుంచి ఆ సొమ్మును రాబట్టాలని స్పష్టం చేసింది. ఎస్ఏ దాఖలు చేయడంలో 1016 రోజుల జాప్యాన్ని మాఫీ చేయాలని కోరుతూ మంగళగిరి తహసీల్దార్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జట్టు దేవానంద్ బుధవారం ఈ తీర్పు ఇచ్చారు.
తమ భూమి విషయంలో అధికారుల జోక్యాన్ని నిలువరించాలని కోరుతూ మంగళగిరి పట్టణ పద్మశాలీ సంఘం మంగళగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా వేసింది. దాన్ని 2014 అక్టోబర్ 21న న్యాయస్థానం కొట్టేసింది. ఆ తీర్పును సవాలు చేస్తూ పద్మశాలీ సంఘం మంగళగిరిలోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో(మెుదటి) అప్పీల్ దాఖలు చేసింది. కింది కోర్టు తీర్పును తప్పుపట్టిన కోర్టు... పద్మశాలి సంఘానికి అనుకూలంగా 2015 ఆగస్టు 11న తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ మంగళగిరి తహసీల్దార్ 2018 సెప్టెంబర్లో రెండో అప్పీల్ వేశారు. అప్పీల్ దాఖలు చేయడంలో 699 రోజులు జాప్యం ఉందని... దానిని మాఫీ చేయాలని కోరారు.
రాజధాని అమరావతి కోసం భూసమీకరణ ప్రక్రియలో అప్పటి అధికారులు, సిబ్బంది తీరిక లేకుండా ఉన్నందున దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు అప్పటి తహసీల్దార్ దృష్టికి రాలేదన్నారు. దీంతో ఆలస్యం జరిగిందే తప్ప.... ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయలేదన్నారు. అయితే 1016 రోజుల జాప్యం జరిగిందన్న పద్మశాలీ సంఘం తరపు న్యాయవాది వాదన నిజమేనని న్యాయమూర్తి తేల్చారు. అసాధారణ జాప్యంతో అప్పీలు దాఖలు చేసిన తహసీల్దార్ది తీవ్ర నిర్లక్ష్యమని తప్పుబట్టారు. జాప్యానికి కారణాలను అంగీకరించలేమన్నారు.