మంగళగిరిలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) సేవలు విస్తృతం కాబోతున్నాయి. ఈ ఏడాది మార్చిలో ఔట్ పేషెంట్ విభాగాన్ని తాత్కాలిక భవనంలో ప్రారంభించింది ఎయిమ్స్. ప్రస్తుతం ఇక్కడ 12 విభాగాల్లో రోగులకు చికిత్స అందిస్తున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. మరోవైపు శాశ్వత భవనాల నిర్మాణ పనులు వేగం పుంజుకుంటున్నాయి. ఊర్లోని వారే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు రోజుకు 300 మంది వరకూ ఎయిమ్స్‌కు వస్తున్నారు.
ఈ నెల 9న నూతన భవనం అందుబాటులోకి రానుంది. ఆధునిక సౌకర్యాలతో ఔట్ పేషెంట్ విభాగాన్ని ప్రారంభించనున్నారు. 18 విభాగాల ద్వారా 120 గదుల్లో చికిత్స అందించనున్నారు. పది రూపాయల ఓపీ రుసుముతోనే కార్పొరేట్ వైద్య సేవలందిస్తున్నారు. ప్రస్తుతం జనరల్ మెడిసిన్, ఈఎన్టీ, కంటి వైద్యం, మానసిక వైద్యం, చర్మం, దంత, ఎముకలు, గైనిక్ సేవలు, చిన్నపిల్లలకు సంబంధించిన వ్యాధులన్నింటికి ఒకే బ్లాకులో వైద్యం అందిస్తున్నారు. నూతన భవనం 5 అంతస్తులతో నిర్మిస్తున్నందున ఒక్కో విభాగానికి ప్రత్యేక గది అందుబాటులో ఉంటుందని ఎయిమ్స్ సూపరింటెండెంట్ రాజేశ్ కక్కర్ చెప్పారు. ఎయిమ్స్‌లో అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉండి.. నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని రోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.