మండలిలో.. ద్రవ్య వినిమయ బిల్లును చివరగా చర్చించాలనే సంప్రదాయంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అలా తీసుకోవడం ఎప్పటి నుంచో ఉందని వైకాపా వాదించింది. మధ్యలో తీసుకోవడం ద్వారా మనం చేసిందే సంప్రదాయంగా మారుతుందని డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం అన్నారు. ఇలాంటి సంప్రదాయం సభ ప్రతిష్ఠ పెంచుతుందా? నలుగురు సభ్యులు ఎక్కువగా ఉన్నారని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయాల్ని పక్కనపెట్టడం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం తీసుకోవాలని సూచించారు. దీంతో.. స్పందించిన డిప్యూటీ ఛైర్మన్..
‘నన్ను మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి నుంచి మీరు దించాలనుకోవచ్చు. అప్పుడు కూడా కూర్చోవాలా? వద్దా? అని నేను ఫ్లోర్ లీడర్లను అడగాలా? సభ నిర్ణయిస్తుందా? నేను గత, ఇప్పటి ప్రభుత్వంలోనూ డిప్యూటీ ఛైర్మన్‌నే. అయినా భద్రత తొలగించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళితే మూడు నెలల కిందట పునరుద్ధరించారు. తర్వాత మళ్లీ ఒకరిని వెనక్కి పిలిపించారు. భద్రత కూడా తీసేశారు’ -డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం
తన హక్కులు తొలగించడం ఎందుకు... అవిశ్వాస తీర్మానం పెట్టి తనను దించేయండి అని డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం ఆవేదన వ్యక్తం చేశారు.