తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మాణిక్యర గ్రామ పంచాయతీ పరిధిలో పిడుగు పాటుకు గురైన రైతు మృతి చెందాడు. ఇల్లందు మండల పరిధిలోని బిలియా తండాలో మిర్చి తోటలో పని చేస్తుండగా వర్షం రావడం వల్ల సమీపంలోని వేప చెట్టు కిందికి వెళ్లారు. కొంతసేపటికే పెద్ద శబ్దాలతో పిడుగుపడింది. ఘటనలో మిట్టపల్లి గ్రామానికి చెందిన గుగులోత్ రాందాస్ అక్కడికక్కడే మృతిచెందాడు.
మిర్చితోట పనులకు వెళ్లగా...
బంధువుల ఇంటికి వచ్చి కొమరారం ఏరియాలో ఉన్న వ్యవసాయ భూమిలో మిర్చితోట పనులకు వెళ్లగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం 13 మంది రైతులు చేనులో పనులు చేసుకుంటున్న క్రమంలో రాందాస్ అక్కడికక్కడే మృతి చెందగా... మిగతా 12 మంది స్పృహ కోల్పోయారు. గమనించిన గ్రామస్థులు బాధితులకు ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత వారు కోలుకున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపారు.