పుణెకు చెందిన ఆదిత్య తివారీ 2016లో 22నెలల వయసున్న బాబును దత్తత తీసుకున్నాడు. అప్పటికే ఆ చిన్నారికి కొన్ని జన్యుపరమైన సమస్యలున్నాయి. ప్రస్తుతం ఆరేళ్లున్న ఆ పసివాడిని అల్లారుముద్దుగా, కంటికి రెప్పలా పెంచారు తివారీ. తాను చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాన్నీ వదిలేశారు. ఈయన త్యాగానికి గుర్తింపు దక్కింది. ప్రపంచ మహిళల దినోత్సవం సందర్భంగా మార్చి 8న బెంగళూరులో జరగనున్న ఓ కార్యక్రమంలో ఈయన 'ఉత్తమ అమ్మ'గా గౌరవం పొందనున్నారు.
జనవరి 1, 2016లో తివారీ 22నెలల వయసున్న బాబును దత్తత తీసుకున్నారు. అన్విష్ అని పేరు పెట్టారు. బాలుడి రాకతో తివారీ జీవితం కొత్త మలుపులు తిరిగింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగాన్ని వదిలేసి అన్విష్ లాంటి ప్రత్యేక అవసరాలుగల పిల్లల తల్లిదండ్రులకు సహాయం చేయడానికి తివారీ కౌన్సెలర్‌గా మారారు.
తివారీ అన్విష్తో కలిసి దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో సమావేశాలు, వర్క్‌షాపులు నిర్వహించారు. ఇలా దాదాపు 400 ప్రాంతాల్లో తివారీ మాట్లాడారు. 10వేల మంది తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లల జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేసేలా రూపొందించిన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఈయనకు ఐక్యరాజ్యసమితి నుంచీ, 'వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్' జెనీవా నుంచీ ఆహ్వానం అందింది.