Attack With Knife: ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కత్తి దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సినిమాల ప్రభావమో ఏమో గానీ ప్రాణాలతో చెలగాట మాడుకుంటున్నారు. మొన్న వరంగల్‌లో ప్రేమించలేదని కత్తితో గొంతు కోసిన ఘటన మరవకముందే ఇవాళ మరో దాడి జరిగింది. ఓ యువతి పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఉన్మాది కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో చోటు చేసుకుంది.
మందమర్రి మండలం బొక్కల గుట్ట గ్రామానికి చెందిన ఓ యువతి నస్పూర్‌లోని బంధువుల గృహప్రవేశానికి వెళ్లారు. నస్పూర్‌కు చెందిన సాయి కిరణ్ గౌడ్.. యువతిని పెళ్లి చేసుకుంటానని వారి బంధువులతో మాట్లాడగా నిరాకరించారు. దీంతో.. ఆక్రోశంతో గీత కార్మికులు ఉపయోగించే కత్తితో యువతిపై దాడికి దిగాడు. ఈ దాడిలో యువతి మెడకు గాయమవడంతో వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.