ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శివరాత్రికి ఏ ఆలయంలో ఏం చేయబోతున్నారు?

శివరాత్రి పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలు సుందరంగా ముస్తాబు అవుతున్నాయి. భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం ఆయా దేవాలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎలాంటి అసౌకర్యాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

mahasivarathi celebrations at all temples
శివరాత్రికి సర్వాంగ సుందరంగా ముస్తాబయిన ఆలయాలు

By

Published : Feb 20, 2020, 11:46 PM IST

Updated : Feb 21, 2020, 12:02 AM IST

శివరాత్రికి సర్వాంగ సుందరంగా ముస్తాబయిన ఆలయాలు

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలోని 18 అడుగుల స్వయం భూ శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. సమీప సీత పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటే కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవం జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. జాగారం చేసే భక్తుల కోసం సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మురమళ్లలోని శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామికి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అభిషేకాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు సప్తనదీ జలాలతో అభిషేకాలు చేస్తారు. కె.గంగవరం మండలం కోటిపల్లిలో ఉన్న శ్రీ ఛాయాసోమేశ్వర స్వామి ఉత్సవాల్లో వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. తెల్లవారుజామునే గౌతమి గోదావరిలో పుణ్యక్షేత్రాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటారు. శివరాత్రి సాయంత్రం కోటి దీపోత్సవం నిర్వహిస్తారు.

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల్లో శివాలయాలు లయకారుడి సేవకు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. పెనుమూరు మండలంలో పులిగుండు ఆలయం, గంగాధర నెల్లూరు ఎస్ఎస్ కొండ సిద్దేశ్వర ఆలయం, శ్రీరంగరాజపురం మండలం ఆత్మ లింగేశ్వర ఆలయం, కార్వేటినగరం మండలం శ్రీ సదాశివ ఈశ్వర స్వామి ఆలయం, వెదురుకుప్పం, డీఆర్‌ఎన్‌ కండ్రిగా అరుణగిరి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత కొండ మల్లేశ్వర స్వామి ఆలయం , బ్రాహ్మణపల్లె స్వయంభూ సిద్దేశ్వర్ ఆలయం, ముఠాలం సిద్దేశ్వర ఆలయాలు శివరాత్రి వేడుకలకు సిద్ధమయ్యాయి. శివరాత్రి పూజల కోసం కొండ మల్లేశ్వర ఆలయంలో చలువ పందిళ్లు, పుష్పాలంకరణ చేశారు. ఆలయాల వద్ద విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని పొలతల పుణ్యక్షేత్రానికి లక్షల మంది భక్తులు తరలివస్తారు. దాదాపు ముగ్గురు డీఎస్పీలు, 14 మంది సీఐలు ఐదుగురు ఎస్ఐలు, ఏఎస్ఐలు బందోబస్తు విధుల్లో ఉన్నారు.

మహాశివరాత్రి కోసం కడప జిల్లా ఆర్టీసీ అధికారులు దాదాపు మూడు వందల పద్దెనిమిది ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. జిల్లాలోని పొలతల పుణ్యక్షేత్రానికి దాదాపు 160 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నారు. భక్తులకు రక్షణపరంగా పోలీస్ శాఖ దాదాపుగా 400 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసింది.

అనంతపురం జిల్లా అమరాపురం మండలం హేమవతిలో వెలసిన శ్రీ హెంజేరు సిద్దేశ్వర స్వామి ఆలయంలో శివుడు మానవ ఆకారంలో సిద్ధాసనంలో దర్శనం ఇస్తారు. ఆలయ ప్రాంగణంలో మల్లేశ్వర, విరుపాక్షేశ్వర, సోమేశ్వర ఆలయాల్లో శివుడు లింగాకృతిలో పూజలందుకుంటున్నాడు.

కృష్ణా జిల్లా ముసునూరు మండలం బలివే గ్రామంలోని శ్రీ భలేరామ స్వామి ఆలయం శివరాత్రి వేడుకలకు సిద్ధమైంది. ప్రతి సంవత్సరం వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామి తీర్థప్రసాదాలు స్వీకరిస్తుంటారు. నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సహకారంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.

నెల్లూరు నగరంలో ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 18 అడుగుల భారీ శివలింగం ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. విలువలతో కూడిన ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులను ఆలరించేలా మహాశివుడి రూపాలను తయారు చేసి మోడల్స్​గా ప్రదర్శించారు.

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని బుగ్గ రామేశ్వరస్వామి ఆలయం గడివేముల మండలంలోని భోగేశ్వర స్వామి ఆలయాలను శివరాత్రి సందర్భంగా సుందరంగా అలంకరించారు. స్వామి కళ్యాణం, భక్తుల పుణ్య స్నానాలు, స్వామి దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇదీ చూడండి:

అమ్మకానికి మహవీర్ హరిణ జాతీయ పార్క్​!

Last Updated : Feb 21, 2020, 12:02 AM IST

ABOUT THE AUTHOR

...view details