రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరికరాలు పనిచేయక రోగులు ఇబ్బందులు పడుతున్నారు . ప్రభుత్వ ఆసుపత్రుల్లో యంత్రాలు పనిచేయకపోవడంతో ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లాల్సి వస్తోంది. పేదలకు వేలాది రూపాయలు నిలువుదోపిడీ అవుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లోని విలువైన పరికరాలు మూలనపడ్డాయి. సరిగా వినియోగించకపోవడం, మరమ్మతులు చేయించకపోవటం, నిపుణులు లేకపోవడం వల్ల నిరుపయోగంగా మారాయి. కర్నూలు సర్వజన ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలోని క్యాతలాబ్ 6 నెలలుగా మూలనపడింది. ఫలితంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రోగులకు వైద్యం, పరీక్షలు నిర్వహించాల్సివస్తోంది. విద్యార్థులకూ ప్రాక్టికల్స్ ఇబ్బందిగా మారాయి..
ఆదోని ప్రాంతీయ అస్పత్రిలో కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన పరికరాలను స్టోర్ గదుల్లో ఉంచి తాళాలు వేశారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరికరం ఉన్నా.. పదేళ్ల నుంచి వినియోగించడం లేదు. సిబ్బంది ఆసుపత్రికి రాకుండా సొంత క్లినిక్‌లకే ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపణలున్నాయి. నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో ఎండోస్కోపీ, ల్యాప్రోస్కోపీ యంత్రాలను మూడేళ్ల క్రితం కొనుగోలు చేసినా... ఒక్కసారీ వినియోగించలేదు. వైద్య అవసరాల కోసం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లక తప్పడం లేదు. ఆళ్లగడ్డ సీహెచ్‌సీలో కీలకమైన ఎన్బీసీ న్యూబోర్న్ కేర్ యూనిట్ పనిచేయడంలేదు. 40 లక్షల రూపాయల వ్యయంతో గత ఏడాది డిసెంబర్‌లో ఏర్పాటు చేసిన ఈ యూనిట్.. ప్రస్తుతం సేవలకు దూరమైంది.
సీఎం సొంత జిల్లా వైఎస్‌ఆర్‌లోని ప్రభుత్వాసుపత్రుల్లో.. అత్యవసర వైద్య పరికరాలు, యంత్రాలు ఉన్నా అవి పనికిచేయకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కడప రిమ్స్ ఆస్పత్రిలో ఎక్స్‌రే యంత్రాలు పనిచేయకపోవడం వల్ల రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోగులందరికీ... మొబైల్ ఎక్స్‌రేని వినియోగించడం కష్టంగా మారింది. ప్రైవేటు ఆస్పత్రులకు లేదా తిరుపతికి వెళ్లాలని వైద్యులు సిఫారసు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట వైద్య విధాన పరిషత్ ఆస్పత్రిలో ఏడాది కిందట కొత్తగా ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుచేసినా నిరుపయోగంగానే ఉంది. వైద్యులు అందుబాటులో లేనందున... ఎక్స్ రే యంత్రాలు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. జమ్మలమడుగులోని ప్రాంతీయ ఆస్పత్రిలోనూ నెల రోజులుగా ఎక్స్‌రే యంత్రం పనిచేయడం లేదు.