ప్రపంచాన్ని కరోనా వైరస్ భయపెడుతుంటే తెలంగాణలోని వనపర్తి జిల్లాలో మాత్రం పశువులకు సోకిన లంఫీ స్కిన్ వ్యాధి... రైతులను బెంబేలెత్తిస్తోంది. పశువుల శరీరంపై కణితులు రావటం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. ఈ వ్యాధి వల్ల పశువుల మరణాల రేటు తక్కువగా ఉన్నా... పాల ఉత్పత్తి సామర్థ్యం క్షీణించడం ప్రమాదకరమైన పరిణామం. అందుకే ఈ వైరస్ పట్ల రైతులంతా... అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా అధికారులు హెచ్చరిస్తున్నారు.
కాప్రి ఫాక్స్..
కాప్రి ఫాక్స్ జాతికి చెందిన వైరస్ కారణంగా ఈ వ్యాధి పశువులకు సంక్రమిస్తుంది. ఈ వైరస్ శరీరంలో ప్రవేశించిన 4 నుంచి 10రోజుల్లో లక్షణాలు బయటకు కనిపిస్తాయి. జ్వరం, కళ్లు, ముక్కు, నోటి నుంచి చొంగ కారటం, కాళ్ల వాపు వంటివి ప్రాథమిక లక్షణాలు. 2 నుంచి 5 సెంటీమీటర్ల వ్యాసం కల్గిన గుండ్రని చర్మ కణితులు ఏర్పడతాయి. కణజాలం, కండర కణాలలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. పెద్ద పరిమాణంలో ఏర్పడ్డ కణితులు పగిలి రక్తస్రావం అవుతూ ఉంటుంది. అలాంటి పశువుల ఆరోగ్యం క్షీణిస్తోంది. జీర్ణశక్తి కోల్పోతాయి. గిత్తల్లో వ్యందత్వం ఏర్పడుతుంది. పాలిచ్చే పశువులలో పొదుగు వాపు వచ్చే ప్రమాదం ఉంది. శ్వాసకోశ ఇబ్బందులు కూడా వస్తాయి.
ఒక పశువు నుంచి మరో పశువుకు..
దోమలు, ఈగలు, గోమార్ల వంటి కీటకాలు కుట్టడం ద్వారా వ్యాధి ఒక పశువు నుంచి మరో పశువుకు వ్యాప్తి చెందుతోంది. వ్యాధి సోకిన పశువు లాలాజలం, తాగిన నీరు ద్వారా ఇతర పశువులకు వ్యాధి సంక్రమించే ప్రమాదం సైతం ఉంది. ఇప్పటికే వనపర్తి జిల్లాలో సుమారు మూడువేల పశువులకు ఈ వ్యాధి సోకిందని అంచనా.