తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ రేపు ఆ రాష్ట్ర అధికార పార్టీ తెరాస గూటికి చేరనున్నారు. తెలంగాణ భవన్లో తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేతుల మీదుగా ఎల్.రమణ తెరాస ప్రాథమిక సభ్యత్వం స్వీకరించనున్నారు. కేటీఆర్ గులాబీ కండువా కప్పి రమణను పార్టీలోకి ఆహ్వానిస్తారు. తెరాసలో ఎల్.రమణ చేరికపై కొంత కాలంగా చర్చలు జరిగాయి. ఈ నెల 8న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ను ప్రగతిభవన్ లో కలిసి.. తెరాసలో చేరిక, పార్టీలో బాధ్యతలు, రాజకీయ భవిష్యత్తుపై చర్చించారు.
రెండు రోజుల క్రితం తెతెదేపా అధ్యక్ష పదవికి రమణ రాజీనామా చేశారు. ఎల్.రమణకు త్వరలో ఎమ్మెల్సీ పదవితో పాటు.. భవిష్యత్తులో పార్టీ, ప్రభుత్వంలో క్రియాశీలక అవకాశాలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలు, ఈటల రాజేందర్ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలమైన బీసీ నేత కోసం చూస్తున్న తెరాస.. ఎల్.రమణను పార్టీలోకి ఆహ్వానించింది.
ఆవిర్భావం నుంచి తెదేపాలోనే
రమణ తెలుగుదేశం సీనియర్ నేత. పార్టీ ఆవిర్భావం నుంచి అందులోనే ఉన్నారు. 1994లో జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి, 1996లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత పలు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఆయన 2009 శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల నుంచి విజయం సాధించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెతెదేపా అధ్యక్షునిగా రమణ కొనసాగుతున్నారు.