పార్టీ మారడంపై అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు.ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో కలిసి.. మంత్రి ఎర్రబెల్లి, ఎల్.రమణ సుదీర్ఘంగా చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగిందని రమణ తెలిపారు. తెరాసలోకి రావాలని కేసీఆర్ ఆహ్వానించారని వెల్లడించారు. సామాజిక తెలంగాణ కోసం కలిసి ముందుకు వెళ్దామని అన్నారని తెలిపారు.
'సీఎం కేసీఆర్ను కలిశాను. తెలంగాణ రాష్ట్ర సాధన, రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలపై గంటన్నరపాటు చర్చించాం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరుగున్న అభివృద్ధిపై కూడా మాట్లాడుకున్నాం. అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలని సీఎం అన్నారు.
-ఎల్.రమణ, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
ఎల్.రమణ అంటే కేసీఆర్‌కు అభిమానమని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. చేనేత కుటుంబం నుంచి వచ్చిన రమణ తెరాసకు అవసరమన్నారు. ఆయనను తెరాసలోకి రావాలని కేసీఆర్ ఆహ్వానించారని తెలిపారు. రమణ సానుకూలంగా స్పందించారన్నారు.