వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి అనుకుని అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ అధికారులు ప్రకటించారు. రానున్న 48 గంటల్లో ఇది మరింతగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావం.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఏన్టీఆర్, గుంటూరు జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని చెప్పారు. రేపు అక్కడక్కడా భారీ వర్షాలు, ఎల్లుండి పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఎగువ నుంచి వస్తున్న వరదలు, భారీవర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. హెచ్చరించిన వాతావరణ శాఖ! - బంగాళాఖాతంలో వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న రెండు రోజుల్లో ఇది మరింతగా బలపుడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలతోపాటు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
గోదావరికి పెరుగుతున్న వరద :ఎగువన కురుస్తున్న వర్షాలతో.. గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 8.45 లక్షల క్యూసెక్కులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో.. రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే పరిస్థితి రావొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో.. వరద ముంపు మండలాలను విపత్తుల సంస్థ అధికారులు అప్రమత్తం చేశారు. వరద ఉద్ధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు.. సహాయ చర్యల కోసం 2 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు.. ప్రకాశం బ్యారేజ్ వద్ద దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.