ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రేమించలేదని.. విద్యార్థిని గొంతు కోసిన ఉన్మాది!

నిత్యం ఏదో ఒక చోట ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ఇష్టంలేదని చెబుతున్నా వెంటపడి వేధిస్తున్నారు. తమ ప్రేమను కాదంటే చివరికి ఆ అమ్మాయి ప్రాణాలు తీయడానికి సైతం సిద్ధమౌతున్నారు. అలాంటి ఘటనే తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందనే నెపంతో కత్తితో దాడికి తెగబడ్డాడు. ఆ వివరాలు...

LOVER ATTACK
LOVER ATTACK

By

Published : Apr 22, 2022, 4:29 PM IST

Man Slits Throat of A Girl : హనుమకొండలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చిన విద్యార్థినిపై ఓ యువకుడి కత్తితో దాడిచేశాడు. ప్రేమ పేరుతో కొంత కాలంగా వేధిస్తున్న యువకుడు.. అమ్మాయి కాదనటంతో ఉన్మాదిగా మారి.. ఆమె గొంతు కోశాడు. బాధితురాలికి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం యువతి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ముగ్గురు వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని.. 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని ఎంజీఎం వైద్యులు వెల్లడించారు.

వరంగల్ జిల్లా నర్సంపేటలోని లక్నేపల్లి గ్రామానికి చెందిన అనూష.. ఉన్నత చదువుల కోసం హనుమకొండలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో అజహర్​ అనే యువకుడు.. తనను ప్రేమించాలని గత కొంత కాలంగా అనూషను వేధింపులకు గురి చేశాడని తోటి విద్యార్థిని తెలిపింది. అనూష అతని ప్రేమను అంగీకరించకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమె గొంతు కోసి హత్యకు యత్నించాడని పేర్కొంది. కాకతీయ విశ్వవిద్యాలయంలో అనూష ఎంసీఏ చివరి సంవత్సరం చదువుతోంది. ఘటనపై స్థానికులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

"ఉదయం 10.30 గంటల సమయంలో నాకు ఫోన్​ వచ్చింది. కాకతీయ యూనివర్సిటీలో చదువుతున్న అమ్మాయికి ఎవరో అబ్బాయి గొంతు కోశారని చెప్పారు. వెంటనే నేను ఆస్పత్రికి చేరుకున్నాను. బాధితురాలు పూర్తిగా ఒత్తిడికి గురైంది. అడిగిన వాటికి సరైన సమాధానాలు చెప్పలేకపోతోంది. ఈ రెండ్రోజుల్లో ఎంసీఏ పరీక్షలు ఉన్నాయని చెబుతోంది." -మల్లికార్జున్‌, మెడికల్‌ ఇన్‌ఛార్జి, ఎర్రబెల్లి ఛారిటబుల్‌ ట్రస్ట్‌

హనుమకొండలోని గాంధీనగర్‌ కాలనీవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సంఘటనతో గాంధీనగర్‌ ఉలిక్కిపడింది. అమ్మాయి చాలా మంచిదని.. అసలు ఇంట్లో నుంచి బయటకు రాదని తెలిపారు. దాడికి ముందు యువకుడు కాలనీలో ద్విచక్రవాహనంపై తిరిగాడని స్థానికులు చెబుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్​ చేస్తున్నారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"నగరంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ తరహా దారుణాలు పునరావృతమవుతున్నాయి. అజహర్​ను కఠినంగా శిక్షించి బాధితురాలికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి." -స్థానికులు

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details